Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఇష్టాల‌కు భిన్నంగా!

అందుకే ఇండ‌స్ట్రీలో సూప‌ర్ స్టార్ గా ఎదిగారు. న‌టుడిగా ఓన‌మాల దిద్దింది తండ్రి నుంచే అయినా? ఆ తండ్రినే మించిన త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో ఎదుగుతున్నారు.

By:  Srikanth Kontham   |   5 Feb 2026 1:07 PM IST
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఇష్టాల‌కు భిన్నంగా!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ద‌ర్శ‌కుల హీరో. ఓ స్టార్ ని రెడీ చేయ‌డం అన్న‌ది ద‌ర్శ‌కుల చేతుల్లోనే ఉంటుంది? అన్న‌ది బ‌లంగా న‌మ్మే న‌టుడాయ‌న‌. రెండున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణంలో ద‌ర్శ‌కుల మాట‌కే క‌ట్టుప‌డి ప‌ని చేసారు. వెండి తెర‌పై ప్ర‌యోగాలకు సైతం వెనుకాడ‌ని న‌టుడు. ఈ విష‌యంలో తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు ఏమాత్రం తీసిపోని నటుడు. ఎలాంటి పాత్ర అయినా...ఆ పాత్ర‌లో ఎలాంటి స‌వాళ్లు ఎదురైనా? అధిగ‌మించి ముందుకెళ్ల‌డం మ‌హేష్ కి వెన్న‌తో పెట్టిన విద్య‌. అందుకే ఇండ‌స్ట్రీలో సూప‌ర్ స్టార్ గా ఎదిగారు. న‌టుడిగా ఓన‌మాల దిద్దింది తండ్రి నుంచే అయినా? ఆ తండ్రినే మించిన త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో ఎదుగుతున్నారు.

సూప‌ర్ స్టార్ లెగ‌స్సీని దిగ్విజ‌యంగా కొన‌సాగిస్తున్నారు. 'వార‌ణాసి' త‌ర్వాత మ‌హేష్ ప్ర‌యాణం మ‌రింత వైవిథ్యంగా సాగ‌బోతుంది? అన్న‌ది అంతే వాస్త‌వం. ఈ ప్రాజెక్ట్ కోసం మ‌హేష్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఏడాది పాటు పాత్ర కోస‌మే మేకోవ‌ర్ అయ్యారు. రక‌ర‌కాల విలు విద్య‌లు నేర్చుకున్నారు. క‌థ‌, అందులో పాత్ర‌కు త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను ఎంతో మౌల్డ్ చేసుకున్నారు. రాజ‌మౌళి కోసం మ‌హేష్ నే రాసిచ్చేసాడు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. 'వార‌ణాసి' విష‌యంలో 200 శాతం రాజ‌మౌళికి క‌ట్టుబ‌డి ప‌ని చేస్తున్నారు అన్న‌ది ఇప్ప‌టికే అర్ద‌మైంది.

రాజ‌మౌళితో సినిమా చేస్తే ఆ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంటుంది? అన్న‌ది గ‌త ప్ర‌మోష‌న్ ఈవెంట్లో మ‌హేష్ మాట‌ల్లో తేట‌తేల్ల‌మైంది. ఆ ఈవెంట్ కోసం మ‌హేష్ త‌న పాత స్టైల్ నే ప‌క్క‌న బెట్టేసాడు. ఈవెంట్ కి సాధార‌ణ చొక్కా..ప్యాంట్ వేసుకొస్తానంటే రాజ‌మౌళి నాలిక మ‌డ‌త పెట్టి అలా కుద‌ర‌ద‌న్నాడు. తాను చెప్పిన‌ట్లు సిద్ద‌మై రావాల‌న్నారు. అందుకే మ‌హేష్ నో చెప్ప‌లేదు. టీష‌ర్ట్.. .స్టైలిష్ డిజైన‌ర్ ప్యాంట్ లో త‌ళుక్కున మెరిసారు. భ‌విష్య‌త్ ఈవెంట్ల‌లో మ‌హేష్ ఒంటిపై చొక్కా కూడా లేకుండా క‌నిపిస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు.

ఆ ర‌క‌మైన హింట్ కూడా ఇచ్చేసారు మ‌హేష్‌. తాజాగా సినిమా కోసం మ‌హేష్ మ‌రో త్యాగం కూడా చేసారు. సినిమా కోసం మ‌హేష్ ర‌న్నింగ్ స్టైల్ ని రాజ‌మౌళి పూర్తిగా మార్చేసారు. మ‌హేష్ లో స‌రికొత్త ర‌న్నింగ్ స్టైల్ ని వెలికి తీసాడు జ‌క్క‌న్న‌. సినిమాలో మ‌హేష్ పోషిస్తోంది రాముడి పాత్ర కావ‌డంతో? అందుకు త‌గ్గ‌ట్టు ర‌న్నింగ్ స్టైల్ ని డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. గెట‌ప్ స‌హా నిలబ‌డే విధానం వ‌ర‌కూ చాలా మార్పులే చేసారు. పురాణాలు, కాల‌ప్ర‌యాణం, సాహ‌స ప్ర‌యాణం ఇలా పాత్ర విధానాన్ని బ‌ట్టి మ‌హేష్ ఔట్ అప్పిరియ‌న్స్ లో చాలా మార్పులు చేసిన‌ట్లు తెలుస్తోంది.

వాస్త‌వానికి మ‌హేష్ సాధార‌ణ ప‌రుగులో ఓ స్టైల్ ఉంటుంది. ఓస్వాగ్ ఉంటుంది. ఆ ర‌న్నింగ్ స్టైల్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్ లాంటి స్టార్లు కూడా మ‌హేష్ ర‌న్నింగ్ స్టైల్ ఎంతో భిన్నంగా ఉంటుం ద‌ని..బాగుంటుంద‌ని ప్ర‌శంసించిన సంద‌ర్భాలెన్నో. మ‌రికొంత మంది జ‌మైకా చిరుత పులి ఉసెన్ బోల్ట్ తో మ‌హేష్ ర‌న్నింగ్ ని పోలిక చేస్తారు. కానీ రాజ‌మౌళి మాత్రం ఆ విష‌యంలో కూడా రాజీ ప‌డ‌లేదు. అన్ని ర‌కాలుగా త‌న‌కు త‌గ్గ‌ట్టుగా మ‌హేష్ ని `వారణాసి` కోసం మౌల్డ్ చేసారు. మ‌హేష్ అందుకు అంక‌త‌మై ప‌ని చేస్తున్నారు.