Begin typing your search above and press return to search.

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

ఏప్రిల్ 7న విడుదల కానున్న మహేష్ బాబు, రాజమౌళి 'వారణాసి' ప్రమోషన్లపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే రుద్ర లుక్, ఇతర పాత్రల పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియో, 'సంచారి' పాట విడుదలయ్యాయి. సినిమాలో ఆరు పాటలు ఉన్నట్లు కీరవాణి వెల్లడించడంతో తదుపరి మెలోడీ లేదా మహేష్ మాస్ సాంగ్‌పై అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ నుంచి పాటలు, టీజర్, మార్చిలో ట్రైలర్‌తో ప్రచారాన్ని వేగవంతం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  M Prashanth   |   6 Nov 2026 10:33 AM IST
వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!
X

'వారణాసి'కి సంబంధించిన నెక్స్ట్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుండగా నవంబర్ కూడా వచ్చేసింది. అంటే చేతిలో ఉన్నది ఐదు నెలల సమయమే. ఇంత భారీ సినిమాకు ఇప్పటినుంచే ప్రమోషన్లు మరింత దూకుడుగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజమౌళి గత సినిమాల ప్రచారంతో పోలిస్తే ఈసారి అసలు హడావుడి మొదలవ్వాల్సి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు మహేష్ బాబు రుద్ర లుక్‌తో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రల పోస్టర్లు వచ్చాయి. కాన్సెప్ట్ వీడియోతో సినిమా విజువల్ స్కేల్‌ను పరిచయం చేశారు. 'సంచారి' పాట కూడా మంచి ఆదరణ పొందింది. అయితే మహేష్, రాజమౌళి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ పాట మరింత పెద్ద స్థాయిలో క్లిక్ కావాల్సిందనే అభిప్రాయాలు వచ్చాయి. అందుకే తర్వాత వచ్చే ప్రమోషనల్ కంటెంట్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

రాజమౌళి సినిమాలకు పాటలు ఎంత పెద్ద బలమో గతంలో చాలాసార్లు రుజువైంది. 'బాహుబలి'లో 'ధీవర', 'పచ్చబొట్టేసిన' పాటలు ప్రత్యేకంగా నిలిచాయి. 'ఆర్ఆర్ఆర్'లో 'నాటు నాటు' ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'కొమురం భీముడో' ఎమోషనల్‌గా ఆకట్టుకోగా, 'దోస్తీ' పాట ఇద్దరు హీరోల బంధాన్ని పరిచయం చేసింది. సినిమా విడుదలకు ముందే పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

'వారణాసి'లో ఆరు పాటలు ఉన్నట్లు కీరవాణి గతంలో చెప్పారు. 'సంచారి' తర్వాత మంచి మెలోడీ లేదా మహేష్ బాబు స్టెప్పులతో సాగే పాటను విడుదల చేస్తే ప్రమోషన్లకు మరో ఊపు రావచ్చు. మహేష్ సినిమాల్లో మెలోడీలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. రాజమౌళి సినిమాల్లోనూ పాటలను కథకు తగ్గట్టుగా రూపొందిస్తుంటారు. ఈసారి ప్రియాంక చోప్రాతో మహేష్ కాంబినేషన్‌లో వచ్చే పాట ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి.

మరోవైపు పాటలతో పాటు ఓ పవర్‌ఫుల్ టీజర్ కూడా ఈ సమయంలో మంచి ఆప్షన్ అవుతుంది. కాన్సెప్ట్ వీడియోలో రాజమౌళి ఊహించిన ప్రపంచం, భారీ విజువల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక మహేష్ బాబు యాక్షన్, డైలాగ్ డెలివరీ, రుద్ర పాత్రలో ఆయన ఇంటెన్సిటీని హైలైట్ చేసే టీజర్ వస్తే అభిమానులకు కావాల్సిన మాస్ కంటెంట్ దొరుకుతుంది. ముఖ్యంగా రాజమౌళి తన హీరోలను పరిచయం చేసే విధానానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

పైగా 'వారణాసి'పై తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ లాంటి నటీనటులు ఉండటం వల్ల హిందీ, మలయాళ మార్కెట్లలోనూ ప్రచారానికి అవకాశం ఉంది. డిసెంబర్ నుంచి పాటలు, టీజర్ వంటి కంటెంట్‌ను వరుసగా తీసుకొస్తే సంక్రాంతి సీజన్‌ను కూడా ప్రమోషన్లకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మార్చిలో ట్రైలర్, ప్రధాన నగరాల్లో ఈవెంట్లతో ఏప్రిల్ విడుదలకు రంగం సిద్ధం చేసుకోవచ్చు.