MB మరో టామ్ క్రూజ్, జాన్ విక్‌లా ఉన్నాడు
సూపర్ స్టార్ మహేష్ ఫేవరెట్ హీరో ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం నిస్సందేహంగా టామ్ క్రూజ్.
By: Sivaji Kontham | 20 Nov 2025 3:30 PM ISTసూపర్ స్టార్ మహేష్ ఫేవరెట్ హీరో ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం నిస్సందేహంగా టామ్ క్రూజ్. అతడు నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ మహేష్ బాబు ఫేవరెట్. ఎంఐ సినిమాల స్ఫూర్తితోనే అతడు కెరీర్ ఆరంభంలోనే వంశీ అనే గూఢచారి నేపథ్య చిత్రంలో నటించాడు. నమ్రత ఇందులో హీరోయిన్. ఈ సినిమా దురదృష్టవశాత్తూ ఫ్లాపైంది కానీ, అది ఇప్పటి ట్రెండ్ లో బహుశా ఒక పూర్తి నిడివి గూఢచారి విశ్వం (స్పై యూనివర్శ్)గా మారేది.
గతం గతః అనుకుంటే, ప్రస్తుతం మహేష్ కొత్త లుక్ కి ఇంటర్నెట్ షేకైపోతోంది. ఎవరు ఈ హాలీవుడ్ స్టార్ అంటూ హాలీవుడ్ లోనే టాక్ నడుస్తోందంటే అతడి క్రేజ్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు మహేష్ ప్రముఖ ఫిట్నెస్ గురూ కుమార్ మన్నవ సమక్షంలో ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ట్రైనింగ్ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు అతడు అంతర్జాతీయంగా పాపులరైన ప్రముఖ ఫిట్నెస్ గురువుల సమక్షంలో మేకోవర్ ని సాధించాడు. ఇప్పుడు మహేష్ లుక్ 50 వయసులో 30కి మారిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు అతడి ఛరిష్మాటిక్ లుక్ గురించి భారతదేశంతో పాటు విదేశాలలోను ముచ్చటించుకుంటున్నారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల దర్శకుడు రాజమౌళి హీరోగా అతడి క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ వీధుల్లోకి ప్రవేశించింది. టాలీవుడ్ నుంచే కాదు.. మొత్తం భారతదేశం నుంచే హాలీవుడ్ హీరో రేంజ్ ఛరిష్మా అతడికి మాత్రమే సొంతం అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
వారణాసి చిత్రాన్ని ఎస్.ఎస్.రాజమౌళి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని కీలక మార్కెట్లలో విడుదల చేయాలని రాజమౌళి- కేఎల్ నారాయణ బృందం సన్నాహకాల్లో ఉన్నట్టు కథనాలొచ్చాయి. ఈ సినిమాతో మహేష్ మార్కెట్ రేంజ్ అమాంతం పాన్ వరల్డ్ కి చేరుకుంటుంది. అతడికి అంతర్జాతీయ మార్కెట్ రెడ్ కార్పెట్ వేస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ వారణాసి స్టిల్స్ హాలీవుడ్ ప్రముఖలకు చెందిన సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. ఒక స్పై ఏజెంట్ ని తలపిస్తున్న బాబు లుక్ ని ప్రశంసిస్తూ ఇంటర్నేషనల్ స్టార్లు పోస్టులు పెడుతున్నారు.
అతడి రూపం జాన్ విక్ ని తలపిస్తోందని, టామ్ క్రూజ్ ని, జేమ్స్ బాండ్ 007 ని పోలి ఉందని ప్రశంసలు కురుస్తున్నాయి. మహేష్ బాబు తన హాలీవుడ్ ఎంట్రీకి జస్ట్ ఇది ఆరంభం మాత్రమే. ముందుంది ముసళ్ల పండగ.
