'వారణాసి' ఈవెంట్.. అసలు ఖర్చు ఎంత?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 16 Nov 2025 5:07 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసిన జక్కన్న.. తనదైన ప్లాన్ తో ముందుకెళ్తున్నారు.
అయితే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిన్న గ్రాండ్ గా వారణాసి ఈవెంట్ ను నిర్వహించిన సంగతి విదితమే. భారీ స్టేజ్, పెద్ద డిజిటల్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో మూవీ టైటిల్ తోపాటు గ్లింప్స్ ను విడుదల చేశారు. అవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఆ ఈవెంట్ కోసం మూవీ టీమ్ బాగా కష్టపడినట్లు రాజమౌళి చెప్పారు. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో అనేక రోజులుగా కార్యక్రమానికి సంబంధించిన పనులు జరిగాయి. పెద్ద ఎత్తున ఈవెంట్ ను నిర్వహించాలని అనుకోవడం వల్ల అనేక రోజులుగా పగలూ రాత్రి పలువురు కష్టపడి ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పాలి.
అయితే వారణాసి మూవీ భారీ ఈవెంట్ కు ఖర్చు ఎంత అయింటుందోనని ఇప్పుడు అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. రూ.15-16 కోట్లు అయ్యే ఛాన్స్ ఉందని కొందరు చెబుతుండగా.. మరికొందరు అంత మొత్తంలో అవ్వదని రూ.10 కోట్ల వరకు ఖర్చు అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో ఈవెంట్ జియో హాట్ స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవ్వగా.. అందుకు కొన్ని కోట్ల రూపాయలు అందుకుని ఉంటారని చెబుతున్నారు. అంతే కాదు.. లైవ్ ఈవెంట్ ప్రసారం అవుతుండగా మధ్యలో వచ్చిన యాడ్స్ ద్వారా రూ.5 కోట్లకు పైగా పొంది ఉంటారని కూడా కొందరు నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
అయితే ఈవెంట్ ఖర్చు రూ.30 కోట్లు వరకు అవుతుందని.. జియో హాట్ స్టార్ రూ.50 కోట్లు చెల్లించిందని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు రూ.15 కోట్ల వరకు ఖర్చు మాత్రమే అయ్యి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి ఎంత ఖర్చు అయిందనే విషయంపై ఎవరూ క్లారిటీగా చెప్పలేం. వారణాసి మూవీ టీమ్ కు మాత్రమే పూర్తి స్పష్టత ఉంటుంది. మరి ఎంతయిందో ఏంటో!
