మహేష్ రివ్యూ వస్తే రావు బహదూర్ కు రెక్కలు వచ్చినట్టే..!
సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం ఒక ఎత్తైతే, స్టార్ హీరోల మద్దతు దక్కించుకోవడం మరో ఎత్తు.
By: Sravani Lakshmi Srungarapu | 23 Jun 2026 5:13 PM ISTసినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం ఒక ఎత్తైతే, స్టార్ హీరోల మద్దతు దక్కించుకోవడం మరో ఎత్తు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన రావు బహదూర్ విషయంలో ఇదే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుండగా, రిలీజ్ కు ముందే అనేక పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు మరో స్పెషల్ ఎట్రాక్షన్ సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామ్యం. నటుడిగా వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, నిర్మాతగా కూడా మంచి కథలను ప్రోత్సహించాలనే దృక్పథంతో మహేష్ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు మద్దతుగా నిలిచిన ఆయన, ఈసారి రావు బహదూర్ నిర్మాణంలో కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు. దీంతో సినిమా మొదటి నుంచే ట్రేడ్ వర్గాల దృష్టి దీనిపై పడింది.
రీసెంట్ గా చిత్రబృందం సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఈ సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. మహేష్ బాబు ఈ సినిమాను చూడనున్నాని అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత మహేష్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారా లేదా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే మహేష్ నుంచి సినిమా గురించి ఒక్క ట్వీట్ వచ్చినా అది రెగ్యులర్ ఆడియన్స్ దృష్టిని సినిమావైపు మళ్లించే అవకాశముంటుంది. అసలే రాజమౌళితో మహేష్ వారణాసి అనే పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్న నేపథ్యంలో మహేష్ నుంచి సినిమా గురించి ఒక్క పాజిటివ్ ట్వీట్ పడిందంటే ఆ సినిమా రేంజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం.
కమర్షియల్ గానూ రావు బహదూర్ ఇప్పటికే మంచి సంకేతాలు అందుకుంటోంది. రిలీజ్ కు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోవడం సినీ యూనిట్‌కు పెద్ద బలంగా మారింది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ అంతగా ఉత్సాహంగా లేకపోయినా, ఈ సినిమాపై చూపిన నమ్మకం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ట్రేడ్ అంచనాల ప్రకారం, సినిమా బడ్జెట్‌లో గణనీయమైన భాగం రిలీజ్ కు ముందే రికవరీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్మాతలకు ఆర్థిక పరంగా కొంత భరోసా లభించినట్టే. అయితే ఇప్పుడు అందరి దృష్టి మాత్రం మహేష్ బాబు రియాక్షన్ పైనే నిలిచింది.
వెంకటేష్ మహా కథనం, సత్యదేవ్ యాక్టింగ్ మహేష్‌ను మెప్పిస్తే, ఆయన నుంచి వచ్చే ప్రశంసలు రావు బహదూర్ కు ఎక్స్‌ట్రా ప్రమోషన్స్ గా మారే అవకాశముంది. సోషల్ మీడియాలో ఆయన చేసే ఒక ట్వీట్, లేదా సినిమా గురించి చెప్పే కొన్ని మాటలు రెగ్యులర్ ప్రమోషన్ ను మించి భారీ ఎఫెక్ట్ చూపగలవు. ఇప్పటికే మంచి బజ్‌తో ముందుకు సాగుతున్న ఈ సినిమాకు మహేష్ మద్దతు బహిరంగంగా లభిస్తే, రిలీజ్‌కు ముందే నెక్ట్స్ లెవెల్ హైప్ ఏర్పడటం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
