Begin typing your search above and press return to search.

సూప‌ర్‌స్టార్ లెగ‌సీని నిల‌బెట్టే వార‌సుడు!

అయితే మ‌హేష్ బాల‌న‌టుడిగా కెరీర్ ప్రారంభించి ఇంత‌టి జ‌ర్నీ సాగించాడు. కానీ అత‌డి కుమారుడు గౌత‌మ్ కృష్ణ మాత్రం సినిమాల‌కు దూరంగా ఉన్నాడు.

By:  Sivaji Kontham   |   31 Aug 2025 1:24 PM IST
సూప‌ర్‌స్టార్ లెగ‌సీని నిల‌బెట్టే వార‌సుడు!
X

సూప‌ర్‌స్టార్ కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని న‌ట‌వార‌సుడిగా మహేష్ బాబు తన 4 సంవత్సరాల వయసులో తెలుగు సినిమా `నీడ`తో బాల న‌టుడిగా అడుగుపెట్టాడు. ఇప్ప‌టికే న‌ట‌న‌లో దాదాపు 34 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాడు. ఆ త‌ర్వాత చ‌దువులు పూర్తి చేసేందుకు 1990 సంవత్సరంలో 9 సంవత్సరాల విరామం తీసుకున్నాడు. మహేష్ బాబు సినిమాల్లో హీరోగా ఆరంగేట్రానికి ముందు 9 చిత్రాలలో నటించాడు. బాల న‌టుడిగా సుదీర్ఘ అనుభ‌వం ఘ‌డించాడు. నీడ, పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడాచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాల చంద్రుడు, అన్న తమ్మడు, కొడుకు దిద్దిన కాపురంలో న‌టించాడు.

1999లో `రాజకుమారుడు` సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి గాను ఉత్తమ న‌టుడిగా నంది అవార్డు అందుకున్నాడు. గుణశేఖర్ ఒక్కడు సినిమా 2003లో మహేష్ బాబుకి మొదటి బ్లాక్ బస్టర్ హిట్‌. పూరి- పోకిరి తో అత‌డి రేంజ్ అమాంతం మారిపోయింది. నేడు అత‌డు భార‌త‌దేశంలోనే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న బిగ్గెస్ట్ స్టార్. ఇప్పుడు రాజ‌మౌళితో పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తూ సంచ‌ల‌నాలకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

అయితే మ‌హేష్ బాల‌న‌టుడిగా కెరీర్ ప్రారంభించి ఇంత‌టి జ‌ర్నీ సాగించాడు. కానీ అత‌డి కుమారుడు గౌత‌మ్ కృష్ణ మాత్రం సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. గౌత‌మ్ ఇంత‌కుముందు `1- నేనొక్క‌డినే` చిత్రంలో బాల న‌టుడిగా సినీరంగంలో అడుగుపెట్టాడు. కొన్ని వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో తండ్రితో పాటు క‌నిపించాడు. కానీ అత‌డు న‌ట‌న‌లో కొన‌సాగ‌లేదు. చూస్తుండ‌గానే గౌత‌మ్ వ‌య‌సు 19. టీనేజ‌ర్‌గా డ‌బుల్ డిజిట్ లో అత‌డు న‌టుడిగా విన్యాసాలు చేయ‌క‌పోవ‌డంపై అభిమానుల్లో చాలా చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు.. గౌత‌మ్ కూడా తండ్రి బాట‌లోనే క‌థానాయ‌కుడు అవ్వాల‌ని అభిమానులు ఇప్ప‌టి నుంచే ప‌ట్టుప‌డుతున్నారు.

త‌న‌యుడు 19 వ‌య‌సుకు చేరుకున్న విష‌యాన్ని మ‌హేష్ ఈరోజు స్వ‌యంగా గుర్తు చేసుకున్నారు. కుమారుడు గౌత‌మ్ కృష్ణ‌ అత్యుత్త‌మ మార్గాల‌లో త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడ‌ని ఆనందం వ్య‌క్తం చేసారు. ``ఈసారి నీ పుట్టినరోజును మిస్ అయ్యావు.. నేను ఎప్పుడూ మిస్ అవ్వలేదు.. కానీ నా ప్రేమ ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఎదుగుతూ షైన్ అవుతూ ఉండు!`` అని కుమారుడిని మ‌హేష్‌ బ్లెస్ చేసారు. గౌతమ్ అందమైన త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేయ‌గా అది వైర‌ల్‌గా మారింది.

మ‌హేష్ కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ మ్యాట‌ర్స్ ని అస్స‌లు విస్మ‌రించరు. త‌న‌యుడి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా విష్ చేయ‌డంలో ఫ్యామిలీ మ్యాన్ విఫ‌లం కాలేదు. అయితే గౌత‌మ్ కృష్ణ విదేశాల‌లో అక‌డ‌మిక్ విద్య‌ను పూర్తి చేసుకుని, న‌ట‌న‌లో ఎప్పుడు అడుగుపెడ‌తాడో మ‌హేష్ కానీ న‌మ్ర‌త కానీ ఇప్ప‌టికీ రివీల్ చేయ‌లేదు. బ‌హుశా గౌత‌మ్ కృష్ణ లండ‌న్ లో విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు ఇంకా రెండు మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంది. ఆ త‌ర్వాత అత‌డు హీరోగా ఆరంగేట్రం చేసేందుకు అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రాజ‌కుమారుడు (1999) చిత్రంతో మ‌హేష్ ఆరంగేట్రం చేసిన‌ప్పుడు ఎంత ప‌రిణ‌తితో ఉన్నాడో అంతే ప‌రిణ‌తితో గౌత‌మ్ కృష్ణ న‌ట‌న‌లోకి అడుగుపెడ‌తాడ‌ని అభిమానులు ఊహిస్తున్నారు.