ఓవర్సీస్ 'వారణాసి'.. ప్లాన్ ఇదేనా..
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
By: M Prashanth | 30 Jun 2026 10:27 AM ISTమహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఓవర్సీస్ బిజినెస్ పై పడింది. ముఖ్యంగా రూ.160 కోట్లకు ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఒకటి భారతీయ భాషలకు సంబంధించిన ఓవర్సీస్ థియేట్రికల్ హక్కుల కోసం రూ.160 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ డాల్ ఖరారైతే, ఓవర్సీస్ రైట్స్ పరంగా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది అత్యంత భారీ డీల్ గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు.
అయితే ఆ వార్తలపై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో రూ.160 కోట్ల డీల్ నిజమా? లేక కేవలం రూమరేనా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ వార్తలను పూర్తిగా నిజమని చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, రాజమౌళి తన రెమ్యూనరేషన్ కు బదులుగా ఓవర్సీస్ హక్కులనే తీసుకున్నారనే వార్తలు కూడా ఇటీవల వైరల్ అయ్యాయి.
దీనికీ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేఎన్ లేదు. గతంలో రాజమౌళి సినిమాల విషయంలో కూడా ఇలాంటి అనేక ప్రచారాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ వార్తల విషయంలో కూడా అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో వారణాసి టీమ్ ప్లాన్ ఊహించని విధంగా ఉండొచ్చని చర్చ జరుగుతోంది.
సాధారణంగా ఏదైనా డిస్ట్రిబ్యూటర్ కు హక్కులు విక్రయించే విధానానికి బదులుగా, అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారిన్ కంపెనీతో డీల్ కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అదే జరిగితే భారతీయ సినిమాల ఓవర్సీస్ బిజినెస్ లో కొత్త ఛాప్టర్ ప్రారంభమైనట్లేనని చెప్పాలి. అయితే సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో విడుదల చేయాలని మూవీ టీమ్ టార్గెట్ గా పెట్టుకుంది.
120కు పైగా దేశాల్లో విడుదల చేసే ప్లాన్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే విడుదల పరంగానూ కొత్త రికార్డు నమోదయ్యే అవకాశముంది. ఇక గ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఫాంటసీ, మైథలాజికల్ అంశాలతో రూపొందుతున్న ఆ చిత్రంలో మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు.
ఏదేమైనా వారణాసి ఓవర్సీస్ హక్కులపై ప్రస్తుతం అనేక వార్తలు వినిపిస్తున్నా.. ఏది నిజం, ఏది ఫేక్ అన్నది ఇంకా ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. రూ.160 కోట్ల డీల్ నుంచి ఫారిన్ కంపెనీతో డీల్ వరకు వస్తున్న ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పడాలంటే మూవీ టీమ్ అఫీషియల్ గా రెస్పాండ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
