వారణాసి.. 25 నిమిషాల కోసం రూ.300 కోట్లా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా చర్చనీయాంశమైంది.
By: Sravani Lakshmi Srungarapu | 17 Feb 2026 1:57 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా చర్చనీయాంశమైంది. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి వినిపిస్తున్న తాజా సమాచారం పరిశ్రమ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సినిమాలోని త్రేతాయుగ ఎపిసోడ్‌కే రూ.250 నుంచి రూ.300 కోట్ల మధ్య ఖర్చవుతుందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
విజువల్ ఎఫెక్ట్స్ కు భారీ ఖర్చు
సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలంటే స్టార్ రెమ్యునరేషన్స్ లేదా విదేశీ లొకేషన్లు అనుకోవడం కామన్. కానీ ఈ సినిమాలో ఎక్కువ ఖర్చు విజువల్ వండర్స్ ను తీర్చిదిద్దడానికే అవుతోందని తెలుస్తోంది. త్రేతాయుగాన్ని నేటి ప్రేక్షకుల ముందు నమ్మదగిన రీతిలో ప్రతిష్ఠించాలంటే సెట్లు, ఆర్ట్ డిజైన్, వీఎఫ్ఎక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్ అన్నీ అత్యున్నత ప్రమాణాల్లో ఉండాల్సిందే. పురాణాల్లో చదివిన అయోధ్య, అరణ్యాలు, యుద్ధరంగాలు, దివ్యాస్త్రాలు తెరపై కృత్రిమంగా కనిపిస్తే ప్రేక్షక అనుభూతి దెబ్బతింటుంది. అందుకే రాజమౌళి ప్రతి ఫ్రేమ్‌నీ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.
వారణాసి కోసం అడ్వాన్డ్స్ టెక్నాలజీ
అందులో వీఎఫ్ఎక్స్ ఖర్చులే ఈ ఎపిసోడ్‌లో ఎక్కువ బడ్జెట్ ను తీసుకుంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఒక హై క్వాలిటీ షాట్‌కే లక్షలు లేదా కోట్లు ఖర్చవుతుండగా, ఇరవై ఐదు నిమిషాల నిడివిలో వేలాది కంప్యూటర్ జనరేటెడ్ షాట్లు అవసరమైతే ఖర్చు ఎంత పెరుగుతుందో అంచనా వేయొచ్చు. భారీ యుద్ధ సన్నివేశాల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, క్రౌడ్ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నేషనల్ వీఎఫ్ఎక్స్ స్టూడియోల ను దీని కోసం వినియోగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
రీసెర్చ్ కోసం అదనపు ఖర్చు
ఇవి మాత్రమే కాకుండా అదనంగా, యాక్షన్ బ్లాక్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన సెట్లు, వైర్ వర్క్, స్టంట్ టీమ్స్, అలాగే ఎమోషన్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే లైవ్ ఆర్కెస్ట్రా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బడ్జెట్ ను పెంచుతున్నాయి. పురాణ కథనాల్లో సహజత్వం అత్యంత కీలకం కావడంతో జ్యుయలరీ, వెపన్స్, కాస్ట్యూమ్స్, ఆఖరి బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా ఎంతో రీసెర్చ్ అవసరం కావడంతో, ఈ రీసెర్చ్ మరియు డీటైలింగ్ ప్రాసెస్ వల్ల ప్రొడక్షన్ డిజైన్ ఖర్చు కూడా పెరిగే అవకాశముంది.
బాహుబలిని మించేలా ప్లానింగ్
రాజమౌళి గత సినిమాల విజువల్ వండర్స్ ను గుర్తు చేస్తూ ఈ ఎపిసోడ్‌ను బాహుబలి కంటే మరింత భారీ స్థాయిలో మలచాలని జక్కన్న చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు. అయితే ఇది కేవలం విజువల్స్ కోసం చేసే ఖర్చు మాత్రమే, కథలోని ఎమోషనల్ డెప్త్ ను ఆడియన్స్ కు నేరుగా చేర్చే ప్రయత్నమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా ఒకే ఎపిసోడ్‌కు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేయడం కాస్త అతిశయోక్తిగా అనిపించినా, ప్రపంచ స్థాయి విజువల్స్ మరియు సాంకేతిక ప్రమాణాలను లక్ష్యంగా పెట్టుకుంటే అది అసంభవం కాదనే భావన ఇండస్ట్రీలో బలపడుతోంది. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ఈ ప్రాజెక్ట్, ఇండియన్ సినిమా టెక్నికల్ లిమిట్స్ ను మరో మెట్టుపైకి తీసుకెళ్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
