వారణాసి ప్రాబ్లమ్ క్లియర్ అయిందా?
అయితే ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. నగరంలో తీవ్రమైన వేసవి నీటి సమస్య కారణంగా షూటింగ్ ఆలస్యమైందని ప్రచారం జరిగింది.
By: M Prashanth | 12 May 2026 11:31 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు విదేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్రబృందం.. ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
కొద్ది రోజుల విరామం తర్వాత మే 12 నుంచి షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ లో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాతోపాటు మెయిన్ క్యాస్టింగ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. మరోవైపు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసే పనుల్లో కూడా మూవీ టీం బిజీగా ఉంది. ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ ఈవెంట్ లో వారణాసి స్పెషల్ మేకింగ్ వీడియోను ప్రదర్శించగా.. త్వరలో ఫ్రాన్స్ లో ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టాక్.
అయితే ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. నగరంలో తీవ్రమైన వేసవి నీటి సమస్య కారణంగా షూటింగ్ ఆలస్యమైందని ప్రచారం జరిగింది. భారీ సెట్స్, యాక్షన్ సన్నివేశాల కోసం మూవీ యూనిట్ దాదాపు 150 వాటర్ ట్యాంకర్లను కోరినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సిటీలో వాటర్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వాటర్ బోర్డు అంతమేర సప్లై చేయలేమని తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
వేసవి కాలంలో హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత నెలకొంటోంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల అవసరాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. దీంతో వారణాసి షూటింగ్ కు తాత్కాలిక బ్రేక్ పడిందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుండటంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేక షూటింగ్ ప్లాన్ లో మార్పులు చేశారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే కొత్త షెడ్యూల్ ముందుగా అనుకున్న భారీ సన్నివేశాలనే తెరకెక్కిస్తారా? లేక తక్కువ నీటి అవసరం ఉన్న ఎపిసోడ్స్ షూట్ చేస్తారా? అన్న విషయంపై ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు. మూవీ టీం మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఇక రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలకు మోడ్రన్ అడ్వెంచర్ టచ్ యాడ్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా తిరిగే ఓ సాహసికుడి కథగా వారణాసి రూపొందిస్తున్నట్లు సమాచారం. సినిమాలో మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా.. ప్రియాంక చోప్రా మందాకిని పాత్ర పోషిస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ గ్లోబల్ ప్రాజెక్ట్ ను నిర్మాతలు కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ రేంజ్ విజువల్ వండర్ గా రూపొందుతున్న వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
