ఒకే సినిమాలో రెండు విభిన్నమైన లుక్స్!
పెహల్వాన్ లుక్ కోసం చరణ్ ప్రత్యేకంగా జిమ్ లో శరీరాన్ని మరింత రాటు దేల్చారు. చరణ్ కెరీర్‌లో ఇది అత్యంత సవాలుతో కూడిన మేకోవర్ అని చెప్పొచ్చు.
By: Srikanth Kontham | 2 April 2026 8:00 PM ISTఅగ్ర హీరోలంతా వెండితెరపై సరికొత్త ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతున్నారు. కేవలం నటనతోనే కాక తమ శారీరక ఆకృతిని పూర్తిగా మార్చుకుంటూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. ఒకే సినిమాలో రెండు భిన్నమైన గెటప్స్‌లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ , రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలంతా తమ రాబోయే చిత్రాల కోసం మరింత ఎఫెర్ట్ తో పని చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు -దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసి గ్లోబల్ స్థాయిలో రిలీజ్ అవుతుంది.
ఈ చిత్రంలో మహేష్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి రుద్ర అనే పవర్ ఫుల్ మాస్ లుక్ కాగా, మరొకటి రాముడు క్లాస్ సాఫ్ట్ లుక్ లో అలరించనున్నారు. ఈ రెండు పాత్రల కోసం మహేష్ జుట్టును, గడ్డాన్ని పెంచుతూ విభిన్నమైన మేకోవర్‌తో ఆకట్టుకుంటున్నారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పెద్ది కోసం అంతే శ్రమిస్తున్నారు. బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ రెండు విభిన్న శరీర ఆకృతులలో కనిపించనున్నారు. కథలో భాగంగా ఆయన ఒక దశలో చాలా లీన్‌గా (బక్కగా), మరో దశలో అత్యంత బల్కీగా (పెహల్వాన్‌లా) కనిపిస్తారు.
పెహల్వాన్ లుక్ కోసం చరణ్ ప్రత్యేకంగా జిమ్ లో శరీరాన్ని మరింత రాటు దేల్చారు. చరణ్ కెరీర్‌లో ఇది అత్యంత సవాలుతో కూడిన మేకోవర్ అని చెప్పొచ్చు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్ లో కూడా తారక్ రెండు షేడ్స్ చూపిస్తున్నారు. షూటింగ్ ప్రారంభంలో సాధారణ లుక్‌లో కనిపించిన తారక్ తదుపరి షెడ్యూల్ కోసం లీన్‌గా మారిపోయారు. ఈ రెండు లుక్స్ సినిమా కథలో కీలక మలుపులుగా చెప్పొచ్చు. తారక్ మరీ లీన్ గా మారడంతో? అభిమానుల్లో కాస్త ఆందోళన కనిపిస్తోంది.
స్టార్ హీరోలు ఇలాంటి సాహసాలు చేయడం వెనుక ప్రధాన కారణం పాత్రల డిమాండ్, ప్రేక్షకులకు కొత్తదనం అందించడం కోసమే. గతంలో హీరోలు కేవలం డ్రెస్సింగ్ స్టైల్ మార్చేవారు. కానీ ఇప్పుడు పాత్ర డిమాండ్ మేరకు శరీరాకృతిలో ఎన్నో మార్పులు చేస్తున్నారు. ఒకే సినిమాలో రెండు వేర్వేరు కాలాల్లో లేదా వేర్వేరు పరిస్థితుల్లో ఉండే పాత్రలను పోషించడం వల్ల నటులుగా వారిలోని ప్రతిభ మరింతగా బయటపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేకోవర్ పరంపర ఇక్కడితే ఆగేది కాదు. మరింత మంది స్టార్లు అగ్ర హీరోలకు ధీటుగా తయారవుతున్నారు. ఛాలెంజింగ్ రోల్స్ కోసం ఎక్కడా త్గడం లేదు.
