మహేష్ కూడా వెయిట్ చేయాల్సిందే?
సూపర్‌స్టార్ మహేష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`లో మహేష్ పోర్షన్ కు సంబంధించిన చిత్రీకరణ భాగం పూర్తయినట్లు తెలుస్తోంది.
By: Srikanth Kontham | 25 Sept 2026 11:02 AM ISTసూపర్‌స్టార్ మహేష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' లో మహేష్ పోర్షన్ కు సంబంధించిన చిత్రీకరణ భాగం పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తేదీకి ఇంకా దాదాపు ఆరు నెలల సమయం ఉండగానే మహేష్ తన పోర్షన్‌ను పూర్తి చేసుకోవడం విశేషం. ఇక వారణాసికి సంబంధించి మహేష్ పూర్తి చేయాల్సిన పనలు డబ్బింగ్...రిలీజ్ సమయంలో ప్రమోషన్ పనులకు అటెండ్ అవ్వడం మాత్రమే. అంతకు మించి వారణాసి విషయంలో మహేష్ పెద్దగా ఇన్వాల్వ్ అయ్యే పనిలేదు. మరి తదుపరి సినిమా మొదలు పెడతారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులభం కాదన్నది అంతే వాస్తవం.
సాధారణంగా ఒక ప్రాజెక్ట్ పూర్తవ్వగానే తదుపరి సినిమాను వెంటనే పట్టాలెక్కించడం మహేష్ కున్న అలవాటు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. `వారణాసి` చిత్రం తర్వాత మహేష్ తదుపరి చిత్రం ఏంటి? ఆయనతో సినిమా చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్నలు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. `వారణాసి` హిట్ అయితే మహేష్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఖాయం. దీంతో మహేష్ మార్కెట్ స్కేల్ ,బాక్సాఫీస్ పొటెన్షియల్ పూర్తిగా మారిపోతాయి.
అలాంటి భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ తర్వాత చేయబోయే ప్రతీ సినిమా కూడా అదే స్థాయిలో లేదా అంతకంటే పెద్ద స్కేల్‌లో ఉండాలని అభిమానులు ఆశిస్తారు. కాబట్టి మహేష్ కూడా తదుపరి అడుగులను వ్యూహాత్మకంగా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడే అసలైన చిక్కుముడి ఉంది. మహేష్ ఇమేజ్‌కు `వారణాసి` తర్వాత సాధించబోయే గ్లోబల్ క్రేజ్‌కు తగినట్లుగా భారీ పాన్-ఇండియా చిత్రాలను తీయగల అగ్ర దర్శకులందరూ ముందస్తు కమిట్మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. మహేష్ తదుపరి చిత్ర దర్శకుల రేస్‌లో సందీప్ రెడ్డి వంగా పేరు ప్రధానంగా వినిపిస్తున్నా? ఆయన ఇప్పటికే ప్రభాస్‌తో `స్పిరిట్` చేస్తున్నాడు.
ఇది పూర్తయిన వెంటనే రణ్‌బీర్ కపూర్‌తో `యానిమల్ పార్క్` పట్టాలెక్కుతుంది. ఇలా రెండేళ్ల పాటు సందీప్ బిజీగానే ఉంటాడు. మరోవైపు సుకుమార్, ప్రశాంత్ నీల్ వేర్వేరు కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారు. అనీల్ రావిపూడి పేరు వినిపిస్తున్నా పాన్ ఇండియా సినిమా తీయగలడా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అలాగే నాగ్ అశ్విన్ కూడా `కల్కి 2` తో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి చేయడానికే ఆయనకు రెండు సంవత్సరాలు సమయం పడుతుంది. ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేస్తారా? మహేష్ అందుకు ఈజీగా అంగీకరించరు. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు వినిపిస్తోంది. కానీ అందులో నిజమెంత? అన్నది తెలియదు.
