వంగానా? బుచ్చినా?.. స్టార్ హీరో ప్లాన్ ఎలా ఉంటుందో..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసితో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 10 Jun 2026 5:00 AM ISTదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసితో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న ఆ ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ శరవేగంగా సాగుతుండటంతో.. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నారన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాజమౌళి సినిమా తర్వాత మహేష్ చేసే ప్రాజెక్టుపై నేచురల్ గానే ఆసక్తి నెలకొంది. వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు తీసుకురానున్న వారణాసి తర్వాత ఆయన ఎలాంటి కథను ఎంచుకుంటారు? ఏ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారు? అన్నది అభిమానుల్లోనూ చర్చకు దారితీస్తోంది. కొద్ది రోజులుగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మహేష్ బాబు సినిమా ఉండొచ్చనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే మహేష్ కోసం సందీప్ పవర్ ఫుల్ కథ సిద్ధం చేశారని, డెవిల్ అనే వర్కింగ్ టైటిల్ తో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశముందని ప్రచారం జరిగింది. మహేష్ కెరీర్ లో ఇప్పటివరకు చూడని మాస్, వైలెంట్, ఇంటెన్స్ షేడ్ లో ఆయన కనిపిస్తారని టాక్ నడిచింది. టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనుందన్న ఊహాగానాలు కూడా వినిపించాయి.
అయితే ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. అదే దర్శకుడు బుచ్చిబాబు సనా. ఉప్పెన, పెద్ది చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న బుచ్చిబాబు తన హ్యాట్రిక్ మూవీ ఎవరితో చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొన్న వేళ.. మహేష్ బాబుతో ఆయన సినిమా చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా పెద్ది ప్రమోషన్స్ లో ఆ విషయంపై స్పందించిన బుచ్చిబాబు.. మహేష్ బాబుతో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని, క్లారిటీ రావడానికి టైమ్ పడుతుందని చెప్పారు. దీంతో ఆ కాంబినేషన్ పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో ఇప్పుడు అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్.. సందీప్ వంగా లాంటి దర్శకుడితో వెళితే పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలన ప్రాజెక్టు వస్తుందని కొందరు భావిస్తున్నారు.
మరోవైపు బుచ్చిబాబు కూడా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ ను సరైన విధంగా మిక్స్ చేస్తూ విజయాలు అందుకుంటున్నారని, మహేష్ తో ఆయన కాంబినేషన్ కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని రూమర్లుగానే చూడాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా, బుచ్చిబాబు పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. చివరి నిమిషంలో మహేష్ పూర్తిగా వేరే దర్శకుడితో సినిమా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో ఆయన ఇలాంటి సర్ప్రైజ్ నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా వారణాసి తర్వాత మహేష్ వేయబోయే స్టెప్ ఆయన కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ గా నిలవనుంది. మరి ఆయన గ్రీన్ సిగ్నల్ వంగాకా? బుచ్చిబాబుకా? లేక ఊహించని మరో దర్శకుడికా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
