మహేష్ ఫ్యాన్స్ ముందు మరో రుద్ర
మహేష్ బాబు 'బిజినెస్ మ్యాన్' రీ రిలీజ్ సందడి థియేటర్లలో ఓ రేంజ్ లో నడిచింది. అయితే సినిమా మొదలయ్యే ముందు ప్రదర్శించిన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
By: M Prashanth | 1 Dec 2025 12:23 PM ISTమహేష్ బాబు 'బిజినెస్ మ్యాన్' రీ రిలీజ్ సందడి థియేటర్లలో ఓ రేంజ్ లో నడిచింది. అయితే సినిమా మొదలయ్యే ముందు ప్రదర్శించిన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మహేష్ బాబు కెరీర్ షోరీల్ గా ప్లే అయిన ఈ వీడియో చివర్లో కనిపించిన ఒక దృశ్యం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. తెరపై మహేష్ బాబు సాక్షాత్తు పరమశివుడి గెటప్ లో కనిపించడమే ఇందుకు కారణం. అయితే ఇది నిజంగా రాబోయే సినిమాలోనిదా? లేక ఫ్యాన్స్ కోసం చేసిన గ్రాఫిక్స్ మ్యాజిక్కా? అనే దానిపై జోరుగా చర్చ మొదలైంది.
ఆ వీడియోలో మొదట నందిపై స్వారీ చేస్తున్న శివుడిని చూపించారు. మరుక్షణమే ఆ శివుడి స్థానంలోకి మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. చేతిలో త్రిశూలం పట్టుకుని, నుదుటన విభూది ధరించి నందిపై వస్తున్న ఆ విజువల్ చూడగానే అది మొత్తం కూడా 'వారణాసి' సినిమా క్లిప్ ఏమో అని అందరూ భావించారు. ఆ గ్రాఫిక్స్ బ్లెండింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉండటంతో, కొంత సేపటి వరకు ఇది సినిమాలోనిదే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
ఇది సినిమాలోని సీన్ అని మేకర్స్ ఎక్కడా అధికారికంగా చెప్పలేదు. కేవలం షోరీల్ కోసం క్రియేట్ చేసిన గ్రాఫిక్స్ వీడియో. 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ లోని షాట్స్ ను, శివుడి ఇమేజ్ తో మార్ఫింగ్ చేసి ఇలా డిజైన్ చేశారని అర్థమవుతుంది. కాబట్టి ఇది అఫీషియల్ లుక్ కాదని చెప్పవచ్చు.
ఇక వారణాసి సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ లో కనిపించనున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి స్వయంగా ఆ స్కెచ్ ను తన వాల్ పేపర్ గా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇక రుద్ర పాత్రలో కనిపిస్తారని నందిపై వెళ్లిన షాట్ ను కూడా టీజర్ లో హైలెట్ చేశారు. ఇప్పుడు సడెన్ గా ఇలా శివుడి రూపంలో కనిపించడంతో మరో రుద్రుడు కనిపించాడు అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే హడావుడి చేస్తున్నారు.
ఇది కేవలం షోరీల్ కోసం చేసినా, మహేష్ ను ఆ గెటప్ లో చూడటం ఫ్యాన్స్ కు ఒక కొత్త కిక్ ఇచ్చింది. రాజమౌళి సినిమా అంటే సర్ప్రైజ్ లు కామన్. కానీ అది సినిమాలోనిదా కాదా అనే క్లారిటీ రాకుండానే సంబరపడటం తొందరపాటే అవుతుంది. AI లాంటి గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా ఉండటంతో జనం దీన్ని రియల్ అని నమ్ముతున్నారు.
వీడియో క్లిప్ ఇండస్ట్రీలో ఒక కొత్త బజ్ క్రియేట్ చేసింది. రాజమౌళి మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. ఇంకా 'వారణాసి'లో మహేష్ పాత్ర ఎలా ఉండబోతోందో తెలియాలంటే అఫీషియల్ టీజర్ వచ్చే వరకు ఆగాల్సిందే. అప్పటివరకైతే ఈ ఫ్యాన్ మేడ్ థియరీలే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాయని చెప్పవచ్చు.
