Begin typing your search above and press return to search.

వారణాసి.. కథలోనే ఇన్ని సర్‌ప్రైజ్‌లంటే..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో రామాయణ ఘట్టాన్ని ప్రస్తుత కాలంతో అనుసంధానించినట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్‌బాబు రాముడిగా కనిపించే ఎపిసోడ్ దాదాపు 25 నిమిషాలు ఉండగా, 60 రోజుల పాటు చిత్రీకరించినట్లు సమాచారం. రుద్ర ప్రయాణానికి ఈ ఘట్టం ఎలా ముడిపడుతుందనే ఆసక్తి నెలకొంది. సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

By:  M Prashanth   |   27 Nov 2026 11:00 PM IST
వారణాసి.. కథలోనే ఇన్ని సర్‌ప్రైజ్‌లంటే..
X

రాజమౌళి సినిమా అంటే భారీ యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ మీద అంచనాలు ఉండటం కామన్. కానీ వారణాసి విషయంలో కథ కూడా అంతకుమించి ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే టైమ్ ట్రావెల్, పురాతన రహస్యాలు, రామాయణ ఎపిసోడ్ గురించి కొన్ని వివరాలు బయటకొచ్చాయి. లేటెస్ట్ గా మహేశ్‌బాబు రాముడి పాత్రను ప్రస్తుత కాలంతో రాజమౌళి కనెక్ట్ చేసిన విధానం సినిమాలో పెద్ద సర్‌ప్రైజ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. అసలు ఈసారి రాజమౌళి ఎలాంటి కథతో వస్తున్నారనే ఆసక్తి పెరుగుతోంది.

వారణాసిలో మహేశ్‌బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా నటిస్తున్నారు. ఇప్పటికే బయటకొచ్చిన కథా వివరాల ప్రకారం రుద్ర ఓ పురాతన వస్తువు కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే వ్యక్తి. అతడి ప్రయాణంలో టైమ్ ట్రావెల్ కూడా ఉంటుంది. అంటార్కిటికా, ఆఫ్రికా, పురాతన రోమ్ వంటి ప్రాంతాలు కథలో భాగమవుతాయని రాజమౌళి గతంలో వెల్లడించారు. వీటికి రామాయణ ఘట్టాన్ని కూడా జోడించారు.

ముఖ్యంగా మహేశ్‌బాబు రాముడిగా కనిపించే ఎపిసోడ్ గురించి రాజమౌళి ఇప్పటికే కొన్ని విషయాలు చెప్పారు. దాదాపు 25 నిమిషాల నిడివి ఉండే ఈ భాగాన్ని 60 రోజుల పాటు చిత్రీకరించారట. రాముడి గెటప్‌లో మహేశ్‌ను మొదటిసారి చూసినప్పుడు తనకే గూస్‌బంప్స్ వచ్చాయని తెలిపారు. ఇక విజయేంద్ర ప్రసాద్ కూడా రాముడు, కుంభకర్ణుడి మధ్య యుద్ధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఎపిసోడ్ కోసం ఇంత సమయం కేటాయించడం చూస్తే కథలో దానికి మంచి ప్రాధాన్యం ఉన్నట్లే.

అయితే ఇక్కడ మరో పాయింట్ ఉంది. రామాయణ ఘట్టాన్ని ప్రత్యేకంగా చూపించడం మాత్రమే కాకుండా, దాన్ని రుద్ర ప్రయాణంతో రాజమౌళి ముడిపెట్టినట్లు సమాచారం. ఒకవైపు వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ, మరోవైపు ప్రస్తుత కాలంలో జరిగే సంఘటనలు. రెండింటి మధ్య కనెక్షన్‌తో స్క్రీన్‌ప్లేను నడిపిస్తే ప్రేక్షకులకు మంచి థ్రిల్ దక్కొచ్చు. గతంలో బాహుబలిలో ఫ్లాష్‌బ్యాక్‌ను ఉపయోగించిన రాజమౌళి ఈసారి టైమ్ ట్రావెల్‌తో మరింత పెద్ద కథను ప్రయత్నిస్తున్నారు.

రాజమౌళి మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సన్నివేశాన్ని కూడా భారీ స్థాయిలో తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వారణాసిలో విజువల్స్‌తో పాటు స్క్రీన్‌ప్లే కూడా కీలకం కానుంది. ఇప్పటికే కథలో అనేక కాలాలు, ప్రాంతాలు, పాత్రలు ఉన్నాయని సమాచారం వచ్చింది. వాటన్నింటికీ రుద్ర ప్రయాణమే ప్రధాన లింక్‌గా ఉండనుంది. విజయేంద్ర ప్రసాద్ కథకు రాజమౌళి ఇచ్చే ట్రీట్‌మెంట్ ఈసారి మరింత స్పెషల్‌గా ఉండే ఛాన్స్ ఉంది.

ఇక వారణాసిని రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా విడుదల చేయనున్నట్లు రాజమౌళి గతంలో చెప్పారు. ఇంత పెద్ద కథను ఒకే సినిమాలో చూపించబోతుండటం కూడా ఆసక్తికరమే. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రామాయణ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోంది.