మహేష్ ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్.. వారం గ్యాప్ లోనే..
సూపర్ స్టార్ మహేష్ బాబును పబ్లిక్ ఈవెంట్లలో చూడటం అభిమానులకు ఎప్పుడూ స్పెషలే.
By: M Prashanth | 24 Jun 2026 11:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబును పబ్లిక్ ఈవెంట్లలో చూడటం అభిమానులకు ఎప్పుడూ స్పెషలే. సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండే ఆయన తరచూ ఫ్యాన్స్ ముందుకు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి మహేష్ బాబు కేవలం వారం రోజుల గ్యాప్ లోనే రెండు వేర్వేరు ఈవెంట్స్ లో పాల్గొనే ఛాన్సులు కనిపిస్తుండటంతో అభిమానుల్లో జోష్ నెలకొంది. ఒకటి ఆయన ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న సినిమా కోసం అయితే.. మరొకటి ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న యువ నటుడి తొలి చిత్రం కోసం కావడం విశేషం.
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్ర షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. ఆ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే పాన్ వరల్డ్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. అయితే వారణాసి షూటింగ్ షెడ్యూళ్ల మధ్య కూడా ఆయన కొన్ని ఇంపార్టెంట్ సినీ ఈవెంట్స్ కు సమయం కేటాయించనున్నారనే ప్రచారం సాగుతోంది. అందులో ముందుగా వినిపిస్తున్న పేరు రావు బహదూర్. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమా నిర్మాణంలో మహేష్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పార్టనర్ గా ఉంది.
ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుకున్న ఆ సినిమా జూలై 3న విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందు నిర్వహించనున్న ప్రమోషనల్ ఈవెంట్స్ లో మహేష్ బాబు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన హాజరవుతారనే వార్త అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఆ ఈవెంట్ తర్వాత ఎక్కువ బ్రేక్ లేకుండానే మరోసారి మహేష్ అభిమానుల ముందుకు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈసారి కారణం కుటుంబానికి చెందిన ప్రత్యేక సినిమా కావడం ఆసక్తికరంగా మారింది.
మహేష్ బాబు అన్నయ్య కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురం చిత్రంపై ఇప్పటికే మంచి బజ్ ఉంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఆ సినిమా ద్వారా ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. జూలై 10న విడుదల కానున్న ఆ మూవీ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై మొదటి వారంలో జరగనున్న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారనే ప్రచారం సాగుతోంది.
ఒకవైపు తన ప్రొడక్షన్ బ్యానర్ పార్టనర్ గా ఉన్న సినిమాకు మద్దతు ఇవ్వడం, మరోవైపు కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరోను ప్రోత్సహించడం ద్వారా మహేష్ వరుసగా రెండు ఈవెంట్స్ లో కనిపించే ఛాన్స్ వచ్చింది. దీంతో అభిమానులు కూడా ఈవెంట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా మహేష్ పాల్గొనే కార్యక్రమాలకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఆయన కాసేపు మాట్లాడినా కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు వారం గ్యాప్ లోనే రెండు సార్లు అభిమానుల ముందుకు రానున్నారనే వార్తతో ఫ్యాన్స్ లో సందడి మొదలైంది. ఆ ఈవెంట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
