మహేష్ కి దేవుడు కాకముందే? కాలేజీలోనూ ఆయన దేవుడే!
అభిమానులకు మహేష్ దేవుడైతే? మహేష్ కు దేవుడు ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ. ఘట్టమనేని కుటుంబానికి గొప్ప అభిమానుల్ని అందించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు మహేష్.
By: Srikanth Kontham | 21 Jan 2026 10:00 AM ISTఅభిమానులకు మహేష్ దేవుడైతే? మహేష్ కు దేవుడు ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ. ఘట్టమనేని కుటుంబానికి గొప్ప అభిమానుల్ని అందించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు మహేష్. తన అభిమానులు ఎంతో నిజాయితీగా ఉంటారని చాలా సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. నిజంగా తాను నటించిన సినిమా చూసి మెచ్చుకునేది వాళ్లే. నచ్చకపోతే బాగాలోదని నిర్మొహమాటంగా చెప్పేది కూడా వాళ్లే. అందుకే అభిమానుల నిర్ణయానికి తానెప్పుడు కట్టుబడి ఉంటానన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కృష్ణ వారసత్వాన్ని మహేష్ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇప్పటికే ఆయన రీజనల్ మార్కెట్ లో పెద్ద స్టార్. `వారణాసి` చిత్రంతో పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ కే పరిచయం కాబోతున్నారు. ఆ సినిమాను ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ ప్లాన్ చేయడంతో?ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు అన్నది అద్దం పడుతుంది. తాజాగా కృష్ణ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను సీనియర్ నటుడు మురళీ మోహన్ రివీల్ చేసారు. సూపర్ స్టార్ గా కృష్ణ హీరోగా రాణిస్తోన్న సమయంలోనే కథానాయకుడిగా మురళీమోహన్ కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ఇద్దరు నటులు కాకముందు ఏలూరులో ఒకే కాలేజ్ లో కలిసి చదువుకున్నారు.
కృష్ణ గారు కాలేజ్ లో చేరే సమయానికే చాలా అందంగా ఉండేవారు. ఆయన హెయిర్ స్టైల్ చాలా బాగుండేది. నాగేశ్వరరావు గారు నటించిన ఓ సినిమా వేడుక ఆ కాలేజ్ గ్రౌండ్ లో జరిగింది. అప్పుడే కృష్ణ గారు కూడా హీరో అవ్వాలనుకున్నారు. చూడటానికి కృష్ణ గారు అమాయకంగా కనిపిస్తారు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ధైర్యంగా తీసుకుంటారు. కాలేజ్ లోనే అందరూ దేవుడు అని పిలిచేవారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి నిజంగానే అభిమానుల పాలిట దేవుడిగా మారారు. పరిశ్రమలో కూడా చాలా మంది దేవుడిగా పిలిచేవారు. కృష్ణని దేవుడిగా పిలచుకోవడానికి చాలా కారణాలున్నాయి.
ఆయన గొప్ప వ్యక్తిత్వంతో ఎంతో మంది మనసులకు దగ్గరయ్యారు. సినిమా ప్లాప్ అయిందంటే నిర్మాత నుంచి పారితోషికం తీసుకునే వారు కాదు. డిస్ట్రిబ్యూటర్లు తన కారణంగా నష్టపోయారని భావించి కృష్ణ సొంత డబ్బునే ఎన్నోసార్లు ఇచ్చారు . అలాగే తనని అభిమానించిన అభిమానుల కోసం అండగా చాలా సందర్భాల్లో నిలబడ్డారు. `అల్లూరి సీతారామరాజు`లో నటించి దేవుడయ్యారు. ఆ సినిమా డైరెక్టర్ రామచంద్రరావు షూటింగ్ మధ్యలో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. దీంతో ఆ సినిమాను కృష్ణ గారు డైరెక్ట్ చేసారు. కానీ దర్శకుడిగా రామచంద్రరావు పేరునే వేసారు. అంతేకాదు రామచంద్రరావు పారితోషికం మొత్తాన్ని కూడా ఆయన కుటుంబానికి పంపించారు.
