Begin typing your search above and press return to search.

వారణాసి వాయిదా పడాలని కోరుకుంటున్న ఫ్యాన్స్‌..!

‘వారణాసి’ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చిత్రబృందం వెల్లడించింది. 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే రాజమౌళి సినిమాల వాయిదా సెంటిమెంట్‌తో కొందరు మహేశ్ అభిమానులు సినిమా ఆలస్యంగా రావాలని కోరుకుంటున్నారు. ఓటీటీ డీల్ పూర్తవడంతో ముందుగా ప్రకటించిన తేదీకే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

By:  Ramesh Palla   |   16 Nov 2026 7:00 PM IST
వారణాసి వాయిదా పడాలని కోరుకుంటున్న ఫ్యాన్స్‌..!
X

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న 'వారణాసి' సినిమా అప్‌డేట్‌ కోసం కొన్ని నెలలుగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో ఒక ఈవెంట్‌ నిర్వహించిన రాజమౌళి ఆ తర్వాత సినిమా గురించి చిన్న అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. పలు కార్యక్రమాల్లో రాజమౌళి, మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొన్నా ఎప్పుడూ వారణాసి గురించి నోరు విప్పిందే లేదు. రాజమౌళి సినిమా గురించి ఎప్పుడూ ఉన్నట్లుగానే సైలెంట్‌గా ఇన్నాళ్లు ఉంది. ఎప్పుడైతే విడుదల తేదీ సమీపిస్తూఉంటుందో అప్పుడు ఆ సైలెన్స్ అంతా బ్రేక్ కావడం మనం చూస్తూ ఉంటాం. వారణాసి సైలెన్స్ బ్రేక్ అయ్యే సమయం వచ్చినట్లు ఉంది. తాజాగా ఒక అభిమాని వారణాసి అప్‌డేట్‌ అంటూ సోషల్‌ మీడియాలో రిక్వెస్ట్‌ చేయడంతో అఫిషియల్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌ లో షూటింగ్‌ పూర్తి అయింది, పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ మొదలైందని పోస్ట్‌లో పేర్కొన్నారు.

వారణాసి సినిమా రిలీజ్‌ డేట్‌..

వారణాసి షూటింగ్‌ పూర్తి అయిందంటూ వచ్చిన అప్డేట్‌ తో ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే వారణాసి సినిమాను 2027 ఏప్రిల్‌ 7న విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయింది, దాదాపుగా ఆరు నెలల సమయం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కి ఉంది. కనుక కచ్చితంగా ఏప్రిల్‌ 7న సినిమా విడుదల ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సమయంలో కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్‌ మాత్రం వారణాసి సినిమా కాస్త ఆలస్యంగా రావాలని, వాయిదా పడ్డ తర్వాత మాత్రమే వచ్చే ఏడాది చివరి వరకు విడుదల కావాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకు కారణాలు వారు చెబుతున్నారు. గతంలో రాజమౌళి సినిమాల సెంటిమెంట్‌ను ఇక్కడ వారు చూపిస్తున్నారు. రాజమౌళి సినిమాలు సూపర్‌ హిట్‌ కావాలంటే ముందుగా ప్రకటించిన తేదీకి రావద్దు అనేది మహేష్ బాబు అభిమానుల అభిప్రాయం. రాజమౌళి ఏప్రిల్‌ 7న వారణాసి తీసుకు వస్తాడా అనేది ఇంకా స్పష్టత లేదు.

మహేష్‌ బాబు ఫ్యాన్స్ కోరిక...

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మర్యాద రామన్న సినిమా మొదలుకుని మొన్నటి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వరకు ప్రతి సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు విడుదల వాయిదా పడే ఉంటాయి అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. మర్యాద రామన్న సినిమాను వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఆలస్యం కారణంగా వారం ఆలస్యంగా విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఈగను మొదట అనుకున్న తేదీ కంటే దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా విడుదల చేశారు. ఇక బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు పార్ట్‌లు కూడా అనుకున్న సమయంకు, ముందుగా ప్రకటించిన సమయంకు చాలా ఆలస్యంగా విడుదల అయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలోనూ అదే జరిగింది. కనుక వారణాసి విషయంలోనూ ఆలస్యం అయితే ఆ హిట్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ కావడంతో పాటు, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ అద్భుతంగా వస్తుందని మహేష్‌ బాబు ఫ్యాన్స్‌లో కొందరు భావిస్తున్నారు.

రాజమౌళి, మహేష్‌ బాబు వారణాసి...

ఫ్యాన్స్‌ సెంటిమెంట్‌లో నిజం లేకపోలేదు. కానీ రాజమౌళి ఈ సారి కాస్త సీరియస్‌గానే అనుకున్న సమయంకు విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వారణాసి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు పూర్తి అయింది. ముఖ్యంగా ఓటీటీ డీల్‌ క్లోజ్ కావడంతో విడుదల తేదీని లాక్‌ చేసినట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓటీటీ వారి డేట్లకు అనుగుణంగానే సినిమాలను థియేట్రికల్‌ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనుక వారణాసి సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్‌ 2027లోనే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వాయిదా పడ్డ రెండు మూడు నెలలు ఆలస్యం కావచ్చు, మరీ ఎక్కువ సమయం, ఎక్కువ నెలలు వాయిదా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ సినిమా కోసం హాలీవుడ్‌ సినిమాలకు చేసిన వీఎఫ్‌ఎక్స్ టీం వర్క్ చేస్తుంది. కనుక ఆలస్యం కు ఎక్కువ అవకాశం లేదు. పైగా గతంతో పోల్చితే వీఎఫ్‌ఎక్స్‌ టెక్నాలజీ సైతం భారీగా పెరిగింది. కనుక వారణాసి 2027 లో, అది కూడా సమ్మర్లో విడుదల దాదాపు కన్ఫర్మ్‌.