Begin typing your search above and press return to search.

వెకేష‌న్ కోసం బ్రేక్ ఇచ్చినా మ‌హేష్ మ‌న‌సు ఇక్క‌డే!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `వారణాసి`.

By:  Sivaji Kontham   |   24 Jun 2026 11:26 AM IST
వెకేష‌న్ కోసం బ్రేక్ ఇచ్చినా మ‌హేష్ మ‌న‌సు ఇక్క‌డే!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `వారణాసి`. పాన్ వ‌ర‌ల్డ్ రిలీజ్ ల‌క్ష్యంగా అత్యంత‌ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం గత కొన్ని నెలలుగా మహేష్ బాబు విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే నిరంతర షూటింగ్ షెడ్యూల్స్ నుండి కాస్త ఉపశమనం పొందేందుకు మహేష్ బాబు ఒక చిన్న విరామం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి వెకేషన్‌కు బయలుదేరారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మ‌హేష్‌ ఫ్యామిలీ సందడి చేయగా.. వీరికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ ఏ దేశానికి వెళ్తున్నారనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు.

ఈ చిన్న విహారయాత్రను ముగించుకుని మహేష్ బాబు 1 జూలై 2026 నాటికి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆ మరుసటి రోజే అంటే జూలై 2న‌ ప్రతిష్టాత్మక `రావు బహదూర్` ఈవెంట్‌లో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా `వారణాసి` తదుపరి షూటింగ్ షెడ్యూల్స్‌లో మహేష్ జాయిన్ అవుతారు. ఇప్ప‌టివ‌ర‌కూ వార‌ణాసి ఇంకా ఎన్ని షెడ్యూల్స్ పెండింగ్ ఉన్నాయో చిత్ర‌బృందం వెల్ల‌డించ‌లేదు. జ‌క్క‌న్న‌ మేకింగ్ శైలి ప్రకారం సినిమాను అత్యంత పర్‌ఫెక్ట్‌గా చెక్కుతున్నార‌నే అర్థమవుతోంది.

`వారణాసి` చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అంటే సినిమా విడుదలకు ఇంకా 9 నెలల సమయం మాత్ర‌మే మిగిలి ఉంది. రాజమౌళి లాంటి గ్లోబల్ స్టాండార్డ్ డైరెక్టర్‌కు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) -గ్రాఫిక్స్ పనులకే చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఒక అంచ‌నా. హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందించడం కోసమే జక్కన్న సుదీర్ఘమైన సమయాన్ని తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ సినిమా కథాంశం గురించి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ఒక ఆసక్తికరమైన హింట్ ఇచ్చారు. ఈ చిత్రం మూడు విభిన్న కలాల్లో సాగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి తగ్గట్టుగానే వార‌ణాసి ఫస్ట్ గ్లింప్స్‌లో కూడా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను రివీల్ చేస్తూ హైప్ పెంచారు. ఒక అడ్వెంచరస్ డ్రామాగా సాగుతూనే.. కాలాల మధ్య ప్రయాణించే ఈ విభిన్న కథాంశం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై కె.ఎల్.నారాయ‌ణ‌ నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతున్న `వారణాసి` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.