Begin typing your search above and press return to search.

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

సినిమాలతో పాటు బిజినెస్ వ్యవహారాల్లోనూ మహేష్ బాబు తన రూటును ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు.

By:  M Prashanth   |   3 Nov 2026 11:37 PM IST
మహేష్.. అసలు గేమ్ ప్లాన్ ఏంటీ?
X

సినిమాలతో పాటు బిజినెస్ వ్యవహారాల్లోనూ మహేష్ బాబు తన రూటును ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన సూపర్ స్టార్ ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఈసారి ఆయన టార్గెట్ కేవలం ఇండియన్ మార్కెట్ మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా గేమర్స్‌ను ఆకట్టుకునే ఓ భారీ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యారు.

ముంబైకి చెందిన షార్ట్‌గన్ గేమ్స్ సంస్థలో మహేష్ పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఈ సంస్థ 'ప్రాజెక్ట్ టేక్‌డౌన్' పేరుతో ఓ యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌ను రూపొందిస్తోంది. భవిష్యత్తు ముంబై నగర నేపథ్యంలో సాగే ఈ గేమ్‌లో దాదాపు 10 నుంచి 15 గంటల గేమ్‌ప్లే ఉంటుందట. పీసీతో పాటు ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ వంటి కన్సోల్స్ కోసం అభివృద్ధి చేస్తున్నారు. అయితే 2028 చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే మహేష్ పెట్టుబడి ఫలితం చూడాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే.

ఇక్కడ మరో ఆసక్తికరమైన కనెక్షన్ ఉంది. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'కు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ విక్కీ అరోరా ఈ గేమ్ యాక్షన్ డిజైన్ బాధ్యతలు చూస్తున్నారు. సినిమాలో చేసే స్టంట్స్‌ను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో గేమ్ క్యారెక్టర్లకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. దీంతో గేమ్‌లో యాక్షన్ కూడా సినిమా స్థాయిలో ఉండేలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులో మహేష్ స్వయంగా ఓ క్యారెక్టర్‌గా కనిపిస్తారనే సమాచారం లేదు. ప్రస్తుతం పెట్టుబడిదారుడిగానే ఆయన భాగస్వామ్యం ప్రకటించారు.

మహేష్‌కు బిజినెస్ రంగం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ ద్వారా మల్టీప్లెక్స్ వ్యాపారంలో ఉన్నారు. ఏఎన్ రెస్టారెంట్స్, ఫిట్‌డే వంటి సంస్థల్లోనూ పెట్టుబడులు ఉన్నాయి. మిత్రోన్స్‌మార్ట్ వంటి స్టార్టప్‌లకు కూడా ఇన్వెస్టర్‌గా వ్యవహరించారు. సినిమా నిర్మాణ రంగంలోనూ ఆయనకు సొంత సంస్థ ఉంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా ఇండియన్ మార్కెట్‌కు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న మహేష్ ఇప్పుడు అమెరికా, బ్రిటన్, యూరప్, జపాన్ వంటి దేశాలను లక్ష్యంగా చేసుకున్న గేమింగ్ ప్రాజెక్టును ఎంచుకున్నారు.

మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న 'వారణాసి' ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే మహేష్‌కు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయన భాగస్వామిగా ఉన్న గేమింగ్ సంస్థకు కూడా కొంత పబ్లిసిటీ కలిసిరావచ్చు. అయితే గేమ్ అమ్మకాలు మాత్రం పూర్తిగా దాని క్వాలిటీ, గేమ్‌ప్లే మీదే ఆధారపడి ఉంటాయి. ప్రపంచ గేమింగ్ మార్కెట్‌లో భాషతో సంబంధం లేకుండా కొత్త కాన్సెప్ట్‌లు హిట్టయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా గేమింగ్ ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ క్లిక్కయితే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అమ్మకాలు సాధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో డెవలప్‌మెంట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆశించిన స్పందన రాకపోవచ్చు. అందుకే మహేష్ ఈసారి ఎంచుకున్న బిజినెస్‌లో రిస్క్‌తో పాటు భారీ లాభాలకు కూడా అవకాశం ఉంది. అయితే ఆయన ఎంత పెట్టుబడి పెట్టారు, కంపెనీలో ఎంత వాటా తీసుకున్నారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. మరోవైపు ఈ గేమ్‌ను భవిష్యత్తులో పెద్ద ఫ్రాంచైజీగా మార్చాలని సంస్థ భావిస్తోంది.