#GlobeTrotterEvent - నాన్న పౌరాణిక చిత్రంలో నటించమని అడిగేవారు: మహేష్
మహేష్ బాబు -రాజమౌళి కాంబినేషన్ మూవీ గ్రాండ్ టైటిల్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వైభవంగా జరిగింది.
By: Sivaji Kontham | 15 Nov 2025 11:19 PM ISTమహేష్ బాబు -రాజమౌళి కాంబినేషన్ మూవీ గ్రాండ్ టైటిల్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వైభవంగా జరిగింది. అయతే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందే టైటిల్ లీక్ అయింది. అధికారికంగా వారణాసి టైటిల్ ని లాంచ్ చేసారు.
వారణాసి అనే టైటిల్ కి రామాయణం- శ్రీరాముడితో లింక్ ఏమిటన్నది తెరపైనే చూడాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో ఒక ఎపిసోడ్ లో మహేష్ శ్రీరాముడిగా కనిపిస్తాడని రాజమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ తన తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణను మూడవ వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కృష్ణ గారి కోరికను ఇప్పుడు నెరవేర్చానని అన్నారు. ``నా తండ్రిని నేను ఎంతగా ఇష్టపడతానో మీ అందరికీ తెలుసు.. నేను ఆయన చెప్పినవన్నీ వినేవాడిని. ఒక విషయం తప్ప.. ఆయన ఎప్పుడూ నన్ను పౌరాణిక చిత్రంలో నటించమని అడిగేవారు. నేను పౌరాణిక గెటప్ లో చాలా బాగుంటానని ఆయన ఎప్పుడూ నాకు చెప్పేవాడు. కానీ నేను ఆయన మాట ఎప్పుడూ వినలేదు. ఆయన ఈ రోజు దీనిని వింటారని నేను ఆశిస్తున్నాను. నాన్నగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉంటాయి`` అని అన్నారు.
రాజమౌళితో సినిమా కోసం తాను ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మహేష్ అన్నారు, ``ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్.. జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే ప్రాజెక్ట్. దీని కోసం నేను వీలైనంత కష్టపడి పనిచేస్తున్నాను. నేను అందరినీ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా నా దర్శకుడిని నేను అత్యంత గర్వపడేలా చేస్తాను. వారణాసి విడుదలైనప్పుడు, భారతదేశం మనల్ని చూసి గర్వపడుతుంది`` అని మహేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో, రాజమౌళి కూడా సినిమాలోని ఒక భాగంలో మహేష్‌ను రాముడిగా చూస్తారని అన్నారు. మేము వారణాసిలో రామాయణం నుండి ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరించాము. దాదాపు అరవై రోజుల షూటింగ్ చేసాం. మహేష్‌ను అలా చూడటం గొప్ప అనుభవం అని అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, కేఎల్ నారాయణ, ఎం.ఎం.కీరవాణి, ఎస్.ఎస్.కార్తికేయ, నమ్రత, సితార ఘట్టమనేని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
