వారణాసి: కరగాల్సిందే, కొత్తగా మెరవాల్సిందే..
టాలీవుడ్ లో రాజమౌళితో సినిమా చేయాలని కోరుకోని హీరో ఉండరు. ఆయనతో సినిమా అంటే గ్లోబల్ ఇమేజ్ గ్యారెంటీ.
By: M Prashanth | 9 Dec 2025 4:02 PM ISTటాలీవుడ్ లో రాజమౌళితో సినిమా చేయాలని కోరుకోని హీరో ఉండరు. ఆయనతో సినిమా అంటే గ్లోబల్ ఇమేజ్ గ్యారెంటీ. కానీ ఆ క్రేజ్ వెనుక హీరోలు పడే కష్టం అంతా ఇంతా కాదు. అవుట్ పుట్ కోసం నటీనటులను పిండేస్తారని, పర్ఫెక్షన్ కోసం చుక్కలు చూపిస్తారని రాజమౌళికి ఇండస్ట్రీలో ఒక పేరుంది. గతంలో ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ వంటి హీరోలు కూడా జక్కన్న పెట్టే పని గురించి సరదాగా భయపడుతూనే చెప్పారు. ఇప్పుడు ఆ వంతు సూపర్ స్టార్ మహేష్ బాబుకి వచ్చింది. వారణాసి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రస్తుతం వస్తున్న వార్తలు చూస్తుంటే మహేష్ బాబు వారణాసి సినిమా కోసం తన కెరీర్ లోనే ఎప్పుడూ పడనంత కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. దానికి కారణం సినిమాలో ఉన్న పాత్రలే. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా 5 విభిన్న అవతారాల్లో కనిపించబోతున్నారట. రాముడు, రుద్ర పాత్రలతో పాటు మరో మూడు గెటప్స్ కూడా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్.
అసలు ఇన్నేళ్ల కెరీర్ లో మహేష్ బాబు ఎప్పుడూ ద్విపాత్రాభినయం కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 5 పాత్రలు అంటే మాటలు కాదు. ఒక్కో పాత్రకు ఒక్కో బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ చూపించాలి. ఒక్క పాత్ర ఉంటేనే వంద టేకులు తీసుకునే రాజమౌళి, ఇప్పుడు 5 పాత్రలంటే మహేష్ ను ఇంకెంత కష్టపెడతారో అని ఫ్యాన్స్ సరదాగా చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా ఈ 5 గెటప్స్ కోసం మహేష్ ఫిజికల్ గా కూడా చాలా మారాల్సి వస్తోంది. ఇప్పటికే రుద్ర లుక్ కోసం జుట్టు పెంచి, కండలు పెంచి కొత్తగా తయారయ్యారు. రాముడి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యిందని అంటున్నారు. మిగిలిన పాత్రల కోసం ఇంకెన్ని మేకోవర్లు చేయాలో, ఇంకెంత కసరత్తు చేయాలో ఆ జక్కన్నకే తెలియాలి. మహేష్ బాబుకి ఇది నిజంగా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనే చెప్పాలి.
అయితే ఆ మాత్రం కష్టం లేకపోతే కిక్ ఉండదు కదా. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ఇది. ప్రపంచం మొత్తం ఈ సినిమా వైపు చూస్తోంది. అందుకే రాజమౌళి ఎక్కడా రాజీ పడటం లేదు, మహేష్ కూడా దర్శకుడు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ ఐదు గెటప్స్ లో వేరియేషన్స్ చూపించడానికి నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు.
ఏదేమైనా జక్కన్న చేతిలో పడ్డాక ఎంతటి స్టార్ హీరో అయినా కరగాల్సిందే, కొత్తగా మెరవాల్సిందే. ఆ పని రాక్షసుడు పెడుతున్న ఈ కష్టం రేపు స్క్రీన్ మీద అద్భుతంగా మారుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ 5 అవతారాల వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే.
