ఎంత ఆఫర్ చేస్తే ఏంటి? రాజమౌళి ప్లాన్ ఎప్పుడూ స్పెషలే!
ముందుగానే హక్కులు అమ్మకుండా, సినిమా వాల్యూ మరింత పెరిగిన తర్వాత ఒప్పందాలు చేయాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 3 Feb 2026 11:35 AM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ సినిమా వారణాసిపై ఇప్పటికే మార్కెట్ లో భారీ హైప్ నెలకొంది. సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారు. అంతే కాదు.. రికార్డు స్థాయిలో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
వారణాసి హక్కులను సొంతం చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి ప్రాంతానికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ.18 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది కేవలం ఒక్క ఏరియాకే అంత పెద్ద మొత్తం కావడం గమనార్హం. ఇప్పటివరకు అదే ప్రాంతంలో బాహుబలి 2 దాదాపు రూ.18 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.
ఇప్పుడు ఆ రికార్డును వారణాసి విడుదలకు ముందే బద్దలు కొట్టేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మరికొంత మంది డిస్ట్రిబ్యూటర్లు ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నారని సమాచారం. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పుడే బిజినెస్ మొదలు పెట్టే ఆలోచనలో లేరట. షూటింగ్ పూర్తయ్యాక పూర్తి స్థాయి మార్కెట్ వ్యూహం అమలు చేస్తామని, అప్పుడే ధరలు కోట్ చేస్తామని చెబుతున్నట్టు వినికిడి.
ముందుగానే హక్కులు అమ్మకుండా, సినిమా వాల్యూ మరింత పెరిగిన తర్వాత ఒప్పందాలు చేయాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల విషయంలో వ్యూహం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తరహాలోనే వారణాసి ప్రాజెక్ట్ కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.
నిర్మాతలు రూ.2000 కోట్లకు పైగా మార్కెట్ ను లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ వాల్యూస్ తో తీర్చిదిద్దుతున్నారు. మహేష్ బాబు కెరీర్ లోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రాజమౌళి బ్రాండ్ వాల్యూ, మహేష్ స్టార్ పవర్ కలిసి సినిమాకు ముందే భారీ డిమాండ్ తీసుకొచ్చాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ముందుగానే హక్కులు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, రాజమౌళి మాత్రం తొందరపడే దర్శకుడు కాదు. సినిమా పూర్తిగా సిద్ధమైన తర్వాతే బిజినెస్ డీల్స్ ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. అలా చేస్తే మరింత ఎక్కువ ధర లభిస్తుందని, రికార్డులు సృష్టించే స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి వారణాసి విడుదలకు ముందే మార్కెట్ లో సంచలనం సృష్టిస్తోంది. షూటింగ్ పూర్తి కాకముందే ఇంత భారీ ఆఫర్లు రావడం చూస్తే, రిలీజ్ సమయానికి ఈ సినిమా ఏ స్థాయి రికార్డులు సృష్టిస్తుందో అన్న ఉత్కంఠ సినీ వర్గాల్లో నెలకొంది.
