'మహేంద్ర గిరి వారాహి' ట్రైలర్: దైవం+ సస్పెన్స్+ థ్రిల్ = విజయం?
సుమంత్ వేగంగా పరుగెత్తడం లేదు.. నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించడం కంటే నెమ్మదిగా సెలెక్టివ్‌గా ప్రయత్నిస్తున్నాడు.
By: Sivaji Kontham | 28 Aug 2026 7:13 PM ISTసుమంత్ వేగంగా పరుగెత్తడం లేదు.. నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించడం కంటే నెమ్మదిగా సెలెక్టివ్‌గా ప్రయత్నిస్తున్నాడు. అతడు కథానాయకుడిగా నటించిన `మహేంద్రగిరి వారాహి` చిత్ర అధికారిక ట్రైలర్ విడుదలవుతూనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని.. ఒక అద్భుతమైన విజువల్ థ్రిల్లర్‌గా నిలిచింది. దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాదిన్నర కాలంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. నిర్మాతలు మధు కలిపు- లక్ష్మణ్ అత్యంత గ్రాండ్ స్కేల్‌లో రాజీ పడకుండా ఈ పౌరాణిక థ్రిల్లర్‌ను రూపొందించారు. థియేటర్ల వెలుపల వారాహి విగ్రహాలను ఏర్పాటు చేసి చేసిన వినూత్న ప్రచారానికి తోడు ఇప్పుడు వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఈ చిత్ర కథాంశం వారాహి అమ్మవారి శాపం.. ఒక రాజవంశం చుట్టూ తిరిగే పౌరాణిక రహస్యం ఆధారంగా సాగుతుంది. ఆ శాపం అసలు ఎలా మొదలైంది? తరతరాలుగా అది ఎలాంటి వినాశనాన్ని తెచ్చిపెట్టింది? అనే ఆసక్తికరమైన విషయాలను ట్రైలర్‌లో చూపించారు. ఈ శాపం నుండి విముక్తి పొందడానికి... రహస్యాలను ఛేదించడానికి తెగించి పోరాడే కథానాయకుడిగా సుమంత్ నటించారు. అతడి నటన, బాడీ లాంగ్వేజ్, సీరియస్‌నెస్ ఈ మొత్తం కథను తన భుజాలపై నడిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుమంత్ బాడీ లాంగ్వేజ్‌కి సూటైన సినిమా ఇదని చెప్పవచ్చు.
సినిమాలోని నటీనటుల ప్రదర్శన ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అమ్మవారికి సంబంధించిన ఒక కీలక పాత్రలో ఐశ్వర్య రాజేష్ తన అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకోగా... సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక (కామియో) పాత్ర సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలవనుంది. సుమంత్ చూపించిన నటన అతడి క్యారెక్టర్ లో డెప్త్ ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్తాయి.
దర్శకుడు సంతోష్ జాగర్లమూడి ట్రైలర్‌ను కట్ చేసిన విధానం.. అతడి విజువల్ స్టోరీ టెల్లింగ్ చాలా ఆకట్టుకున్నాయి. కథలోని అసలు సస్పెన్స్‌ను, రహస్యాలను బయటపెట్టకుండానే ప్రేక్షకులు ఉత్కంఠకు గురయ్యేలా ట్రైలర్‌ను రూపొందించారు. భారీతనం నిండిన ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ - అనూప్ రూబెన్స్ అందించిన శక్తివంతమైన నేపథ్య సంగీతం (బీజీఎం) ట్రైలర్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి.
భారీ సాంకేతిక విలువలు.. బలమైన నటీనటుల ప్రతిభ.. ఆసక్తికరమైన పౌరాణిక నేపథ్యంతో వస్తున్న `మహేంద్రగిరి వారాహి` సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త, చిరస్మరణీయమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. దైవం+ సస్పెన్స్+ థ్రిల్ కలిపితే అది విజయం అవుతుందా లేదా? అనేది వేచి చూడాలి.
