నరసింహ సక్సెస్.. పరశురామ్ పై భారంగా మారిందా?
మార్కెటింగ్ యాంగిల్‌లో చూస్తే, గ్లింప్స్‌ను ముందుగానే రిలీజ్ చేయడం వెనుక స్ట్రాటజీ కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 21 April 2026 1:41 PM ISTగతేడాది భారతీయ సినీ పరిశ్రమలో అనూహ్య సంచలనంగా నిలిచిన మహావతార నరసింహ సక్సెస్‌తో, యానిమేషన్ జానర్‌కు కొత్త ఊపిరి లభించింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం మాత్రమే కాదు, కంటెంట్ బలం ఉంటే యానిమేషన్ సినిమాలకు కూడా భారీ మార్కెట్ ఉందని నిరూపించింది. ఈ సక్సెస్‌తో సహజంగానే తదుపరి భాగం మహావతార పరశురామ్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉన్నాయా అనే ప్రశ్న ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
గ్లింప్స్ కు మిక్డ్స్ రెస్పాన్స్
గ్లింప్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ కనిపించింది. ముఖ్యంగా విజువల్స్ క్వాలిటీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విజువల్స్ అసలు యానిమేషన్‌లా లేదు, ఏఐతో చేసిన వీడియోలా ఉందంటూ కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇటీవలి కాలంలో పురాణాల ఆధారంగా ఏఐ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. అదే స్టైల్‌ను ఈ గ్లింప్స్‌లోనూ గుర్తిస్తున్నామని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, నిజంగా గ్లింప్స్‌లో ఏఐ వాడారా? లేదా అనేది క్లారిటీ రాకపోయినా, ఈ డిస్కషన్ మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచడంలో కీలకంగా మారింది. ఒకవైపు ట్రోలింగ్ ఉంటే, మరోవైపు ఇది కేవలం గ్లింప్స్ మాత్రమేనని, సినిమా ఫైనల్ ప్రొడక్ట్ మాత్రం మెరుగ్గా ఉంటుందంటూ చిత్ర యూనిట్ కు సపోర్ట్ చేస్తున్నారు.
సినిమాపై ఫ్రాంచైజ్ ప్రెజర్
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫ్రాంచైజీ ప్రెజర్. ఒకసారి భారీ హిట్ సాధించిన సినిమాకు సీక్వెల్ రూపొందించడం అంత సులభం కాదు. మొదటి భాగం సక్సెస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టిస్తుంది. అదే అంచనాలను అందుకోలేకపోతే, తర్వాత రియాక్షన్ మరింత తీవ్రంగా మారుతుంది. గతంలో బాహుబలి, కేజీఎఫ్ వంటి ఫ్రాంచైజీలు ఈ ఒత్తిడిని సక్సెస్‌ఫుల్ గా మేనేజ్ చేసి మరింత పెద్ద విజయాలను సాధించాయి. ఇప్పుడదే తరహా ప్రెజర్ మహావతార ఫ్రాంచైజీపై కూడా పడుతోంది. నరసింహ స్థాయి విజువల్స్, ఎమోషన్, నేరేషన్.. వీటన్నింటినీ ఆడియన్స్ ఈ సినిమాలోనూ ఆశిస్తున్నారు.
మార్కెటింగ్ యాంగిల్‌లో చూస్తే, గ్లింప్స్‌ను ముందుగానే రిలీజ్ చేయడం వెనుక స్ట్రాటజీ కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇది కేవలం హైప్ క్రియేట్ చేయడానికేనా? లేక ఆడియన్స్ రియాక్షన్ ను అంచనా వేసి, ఫైనల్ అవుట్‌పుట్‌లో మార్పులు చేయడానికా? అన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, నెటిజన్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను టీమ్ పాజిటివ్‌గా తీసుకుని, సినిమాను మరింత మెరుగుపరచే అవకాశం ఉంది.
బాక్సాఫీస్ పరంగా కూడా మహావతార్ పరశురామ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మహావతార్ నరసింహ రూ.400 కోట్ల మార్క్‌ను దాటిన నేపథ్యంలో, ఈ సీక్వెల్ ఆ రికార్డును క్రాస్ చేస్తుందా అన్నది ఆసక్తికర అంశంగా మారింది. అయితే ఈ టార్గెట్ ను చేరుకోవాలంటే, కేవలం హైప్ సరిపోదు. క్వాలిటీ కూడా అదే స్థాయిలో ఉండాలి. మొత్తం మీద చూస్తే, మహావతార పరశురామ్ ప్రస్తుతం అంచనాలు, వివాదాలు, ప్రెజర్ అన్నీ కలిసిన ఒక క్రిటికల్ దశలో ఉంది. ఈ ప్రెజర్‌ను టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో అదే ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.
