అప్పుడు భక్త ప్రహ్లాద.. ఇప్పుడు మహావతార్ నరసింహ..
ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకున్న హోంబలే సంస్థ.. ప్రహ్లాదుడి కథతో మహావతార్ నరసింహ సినిమాను నిర్మించింది.
By: M Prashanth | 28 July 2025 1:37 PM ISTభక్త ప్రహ్లాద.. 50 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీనే. శ్రీ మహావిష్ణువు భక్తుడైన ప్రహ్లాదుని కథ ఆధారంగా వచ్చిన ఆ మూవీ.. ఇప్పటికే టీవీల్లో వచ్చిన అంతా కచ్చితంగా అతుక్కుపోతారు. అంతలా అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించింది చిత్రం. ప్రహ్లాదుడిగా టాలీవుడ్ హీరో తరుణ్ తల్లి రోజారమణి నటించిన విషయం తెలిసిందే.
హిరణ్యకశిపుడిగా ఎస్వీ రంగారావు, ప్రహ్లాదుడి తల్లిగా అంజలీదేవి నటించారు. చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించిన ఆ సినిమాను మెయ్యప్పన్ నిర్మించారు. అయితే భక్త ప్రహ్లాద సినిమా.. ప్రహ్లాదుడి కథకు వెండితెరపై క్లాసిక్ రిఫరెన్స్ గా పనిచేసింది. ఇప్పటివరకు మళ్లీ ఆ స్టోరీను ఎవరూ టచ్ చేయలేదు.
ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకున్న హోంబలే సంస్థ.. ప్రహ్లాదుడి కథతో మహావతార్ నరసింహ సినిమాను నిర్మించింది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్లపాటు వరుసగా సినిమాలు తీయనుంది. అందుకు గాను మరో నిర్మాణ సంస్థ క్లీమ్ ప్రొడక్షన్స్ తో చేతులు కలిపింది హోంబలే.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలి చిత్రం మహావతార్ నరసింహ ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. సినీ ప్రియులను తెగ మెప్పిస్తోంది. శుక్రవారం విడుదలైన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ.. ఇప్పుడు అంచనాలకు మించి కలెక్షన్లు దక్కించుకుని సందడి చేస్తోంది.
ఫస్ట్ హాఫ్ లో మొదటి నలభై నిమిషాలు, చివరి అరగంట.. ఆడియన్స్ ను కట్టిపడేస్తుందని అంతా అంటున్నారు. ఈలలు కేకలతో థియేటర్స్ హోరెత్తుతున్నాయని చెబుతున్నారు. గ్రాఫిక్స్ అయితే ఓ రేంజ్ లో ఉందని ప్రశంసలు వస్తున్నాయి. గత కొన్నేళ్లలో అలాంటి వీఎఫ్ ఎక్స్ వర్క్ చూడలేదని సినీ ప్రియులు కొనియాడుతున్నారు.
అలా ఇప్పుడు జనరేషన్ మూవీ లవర్స్ కూడా సినిమాకు ఫిదా అవుతున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. 3Dలో రూపొందిన సినిమా కావడంతో అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొత్తానికి మహావతార్ నరసింహ, జెన్ జెడ్ భక్త ప్రహ్లాదగా మారిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మరి మీరు సినిమా చూశారా? ఎలా అనిపించింది?