మహావతార నరసింహ.. సీన్ మొత్తం మార్చేసింది!
ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి యానిమేషన్ మూవీగా కూడా మహావతార నరసింహ నిలిచింది.
By: M Prashanth | 25 Aug 2025 11:34 AM ISTమహావతార నరసింహ.. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఒక రీజనల్ యానిమేషన్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో అంతగా పాపులర్ కానీ జోనర్ లో రూపొందిన ఆ సినిమా.. ఎవరూ ఊహించని రీతిలో క్లిక్ అయింది. సర్ప్రైజ్ హిట్ గా నిలవడమే కాకుండా.. వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.
ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి యానిమేషన్ మూవీగా కూడా మహావతార నరసింహ నిలిచింది. తొలుత రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి ఒక్కసారి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత రూ.200 కోట్ల మైలురాయిని అందుకుంది. ఇప్పుడు రూ.300 కోట్లకు సినిమా వసూళ్లు చేరువలో ఉన్నాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
అయితే సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు దాటడంతో థియేట్రికల్ రన్ ముగుస్తుందని అంతా అనుకున్నారు. కానీ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. నాలుగో వీకెండ్ లో కూడా మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు రూ.300 కోట్ల మైలురాయిని సుసాధ్యం చేసే పనిలో ఉంది చిత్రం.
అదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు ఓటీటీ డీల్ విషయం మరో ఎత్తు.. మహావతార నరసింహ రిలీజ్ కు ముందు ఓటీటీ బిజినెస్ జరుపుకోలేదు. అందుకు కారణాలు తెలియకపోయినా ఒప్పంద మాత్రం కుదరలేదు. ఇప్పుడు ఆ సినిమా ఓ ఓటీటీలోకి వస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. వివిధ ఓటీటీలు గట్టిగా పోటీ పడుతున్నట్టు టాక్.
మేకర్స్ కు పలు ఓటీటీలు మంచి రేటును ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే థియేటర్ లో సినిమాలు చూసిన వాళ్లు మళ్లీ ఓటీటీలో చూస్తారు. కేవలం ఓటీటీలోనే చూడాలనుకునే వారు కూడా ఉంటారు. దీంతో డిజిటల్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే దాని బట్టి చూస్తే.. ఓటీటీ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సీన్ ను మహావతార నరసింహ మూవీ మార్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే కొవిడ్ టైమ్ లో ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో ఆఫర్ చేసి సినిమాలు రిలీజ్ చేశాయి. ఆ తర్వాత సినిమాలన్నింటికీ మంచి రేట్స్ ఇచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో రేట్స్ తగ్గించాయి. నిర్మాతలు వెంట పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మహావతార నరసింహ మొత్తం సీన్ ను ఛేంజ్ చేసింది.
