మహావతార్ నరసింహ.. నెవ్వర్ బిఫోర్ రికార్డ్
మహావతార్ నరసింహ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే డిస్కషన్.. అంతలా అందరినీ ఆకట్టుకుంది ఆ చిత్రం.
By: M Prashanth | 4 Aug 2025 12:49 PM ISTమహావతార్ నరసింహ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే డిస్కషన్.. అంతలా అందరినీ ఆకట్టుకుంది ఆ చిత్రం. స్టార్ క్యాస్టింగ్.. భారీ సెట్స్.. ఎక్కువ ప్రమోషన్స్.. అలాంటివేం లేకుండా.. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద తుఫానులా దూసుకుపోతోంది. సూపర్ మౌత్ టాక్ తో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. యానిమేషన్ మూవీగా వచ్చిన మహావతార్ నరసింహ.. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ వసూళ్లు రాబట్టిన తొలి యానిమేషన్ చిత్రంగా నిలిచింది.
రిలీజ్ అయ్యి మరికొన్ని రోజుల్లో రెండు వారాలు పూర్తి అవుతున్నా.. బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకు ఎక్కువ స్పీడ్ లో దూసుకుపోతుందని చెప్పాలి. రెండో శనివారం రూ.18 కోట్లు వసూలు చేసిన మహవతార్ నరసింహ.. ఆదివారం నాడు రూ.30 కోట్లు దగ్గర రాబట్టింది. అది నెవ్వర్ బిఫోర్ అనే చెప్పాలి. ఫస్ట్ వీకెండ్ కన్నా సెకెండ్ వీకెండ్ ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఇటీవల కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిందని మేకర్స్ వెల్లడించారు.
రూ.105 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ సినిమా విజయం సాధించడంపై నెటిజన్లు ఓ రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు. మూవీకి సంబంధించిన వీడియోస్ తెగ పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. అదే సమయంలో మరో విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.
థియేటర్స్ పిల్లలు, పెద్దలతో ఫుల్ అవుతున్నాయని, సంక్రాంతి సీజన్ లా అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ రోజుల్లో చాలా అరుదుగా అలా కనిపిస్తుందని అంటున్నారు. సరైన కంటెంట్ వచ్చినప్పుడు.. సినిమాలు చూడటానికి కుటుంబ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టమైందని నెటిజన్లు చెబుతున్నారు.
అందుకే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని చిత్ర నిర్మాతలు అనడం ఇప్పటికైనా మానేయాలని హితవు పలుకుతున్నారు. బదులుగా స్ఫూర్తిదాయకమైన కంటెంట్ గురించి ఆలోచించాలని అంటున్నారు. ప్రేక్షకుల నాడిని పట్టుకుని.. సరైన సినిమాలు తీయడం చాలా ముఖ్యమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సినిమా కథ తెలిసినదేనని, కానీ దర్శకుడు అశ్విన్ కుమార్ పిల్లలు, టీనేజర్లకు గట్టిగా ఆకట్టుకునే విధంగా తీశారని నెటిజన్లు చెబుతున్నారు. మహావతార్ నరసింహ మొదట ప్రహ్లాద కథలో అతిథి పాత్రలో కనిపిస్తారని, ఎక్కువ పోరాటం లేకుండా హిరణ్యకశిపుని చంపడానికి క్లైమాక్స్ లో మాత్రమే కనిపిస్తారని చెబుతున్నారు. కొన్నిసార్లు కొంచెం అతిశయోక్తి అయినప్పటికీ, కొన్ని నిజంగా ఆకట్టుకునే క్షణాలు ఉన్నాయని అంటున్నారు. సినిమా అంతటా సంభాషణలు బలంగా, సముచితంగా ఉన్నాయని చెబుతున్నారు. దైవిక తీవ్రతతో భావోద్వేగపరంగా నిండిన క్షణాలు కన్నీళ్లు తెప్పిస్తాయని అంటున్నారు. మస్ట్ వాచబుల్ మూవీ అంటూ కొనియాడుతున్నారు.
