రామాయణం ట్రైలర్: వాల్మీకి క్లాసిక్ కథ AI లో
ఇటీవలే విడుదలైన `మహావతార్ - నరసింహా` యానిమేషన్ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 6 Aug 2025 10:05 AM ISTఇటీవలే విడుదలైన 'మహావతార్ - నరసింహా' యానిమేషన్ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నరసింహస్వామి అవతారం- హిరణ్యకశిప- భక్త ప్రహ్లాదుని కథను తెరపై వీక్షించి ప్రజలు అబ్బురపడుతున్నారు. రజనీకాంత్ రూపంతో తెరకెక్కించిన యానిమేషన్ సినిమా `కొచ్చాడయాన్` కోసం చేసిన ఎలాంటి తప్పును ఇప్పుడు హోంబలే ఫిలింస్ కానీ, దర్శకుడు అశ్విన్ కుమార్ కానీ చేయలేదు. యానిమేషన్ విజువల్స్ అద్భుతంగా కుదిరాయి. దీంతో ఇది బంపర్ హిట్ అయింది. ఇప్పటికే 100కోట్లు పైగా వసూలు చేసిన భారతీయ యానిమేషన్ చిత్రంగా `మహావతార్` రికార్డులకెక్కింది. నిజానికి సినిమాలు తీయడానికి స్టార్లతో పని లేదు.. సాంకేతికతతో ఎలాంటి అద్బుతాలు అయినా సాధ్యమేనని ఇది నిరూపించింది.
4వేల కోట్లు దేనికోసం?
ఇదే సమయంలో రణబీర్ కపూర్ రామాయణం చిత్రం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం తొలుత 800 కోట్ల నుంచి 1600 కోట్ల మేర బడ్జెట్ ఖర్చు చేస్తున్నారని ప్రచారమైనా, ఆ తర్వాత 4000 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం కళ్లు భైర్లు కమ్మేలా చేసింది. వీఎఫ్ఎక్స్ లో వార్ ఎపిసోడ్స్ సహా ఇతర కీలక సన్నివేశాల కోసం దేశవిదేశాల్లో టీమ్ లు పని చేస్తుండడంతో ఇంత పెద్ద ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు. స్టార్లకు భారీ పారితోషికాలు, కాస్ట్యూమ్స్, సెట్స్, మేకప్ వగైరా చాలా ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టాల్సి వస్తోంది. అయితే పరిమిత బడ్జెట్ లో ఒక యానిమేషన్ సినిమా తీసి పెద్ద విజయం సాధించడం ఎలానో `మహావతార్` చిత్రంతో హోంబలే సంస్థ నిరూపించింది.
తరణ్ ఆదర్శ్ పోస్ట్ తో వైరల్:
ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో ఏకంగా 'రామాయణం' కథను విజువలైజ్ చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇటీవల ముంబైకి చెందిన సినీఫై స్టూడియోస్ AI-ఆధారిత సిరీస్ `రామాయణం` ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ అద్భుతమైన పురాణేతిహాసంలోని పాత్రల రూపాల్ని సిద్ధం చేసి, దీనిని కథగా రూపొందించడం ఎంతో అందంగా కుదిరింది. దీంతో బాలీవుడ్ దిగ్గజ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ సైతం దీనిని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసాడు. సిరీస్ లో మొదటి ఎపిసోడ్ ఇది అని కూడా తెలిపారు. తరణ్ ఎక్స్ లో లింక్ ని షేర్ చేస్తూ ఇలా రాసారు. జెన్- ఏఐలో రూపొందించిన రామాయణం ట్రైలర్ ని ఆవిష్కరించారు. ముంబైకి చెందిన సినీఫై స్టూడియోస్ ఘనత ఇది. దీనిని పూర్తిగా తదుపరి తరం AI సాధనాలను ఉపయోగించి రూపొందించారు. వారి అధికారిక చానెల్ లో రిలీజ్ చేసారు. మొదటి ఎపిసోడ్ ఇది! అని తెలిపారు.
సాంప్రదాయానికి విరుద్ధంగా..
ఈ సిరీస్ సాంప్రదాయ యానిమేషన్‌కు బదులుగా పాత్రలను రూపొందించడానికి, దృశ్యాలను సృష్టించడానికి జనరేటివ్ AIని ఉపయోగించారు. అత్యాధునిక విజువలైజేషన్ పద్ధతుతో ట్రైలర్ లో రామాయణం కథను చెప్పిన తీరు ఆశ్చర్యపరిచింది. రామాయణ కథను చాలా సింపుల్ గా కొన్ని పాత్రలతో మలిచిన తీరు ఆకట్టుకుంది. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుల ప్రయాణానికి సంబంధించిన కథాంశాన్ని ఏఐలో అసాధారణంగా తీర్చిదిద్దారు.
ప్రశంసలే ప్రశంసలు:
ప్రస్తుతం ఈ ఏఐ ట్రైలర్ లో క్రియేటివిటీపై నెటిజనుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇవి అత్యుత్తమ విజువల్స్ అని ఒకరు ప్రశంసించగా, మానవ స్పర్శతో రూపొందించిన సినిమా అని మరొకరు ప్రశంసించారు. ఉత్కంఠభరితం.. ఆకర్షణీయం అని కొందరు నెటిజనులు కీర్తించారు. 2025 జూలై నుంచి ఇన్ స్టాలో ఈ ట్రైలర్ అందుబాటులో ఉంది. లక్షల్లో దీనిని వీక్షించారని స్టూడియో పేర్కొంది. రణబీర్ నటిస్తున్న రామాయణం పార్ట్ 1 చిత్రం 2026 దీపావళిన థియేటర్లలోకి వస్తుంది. రెండవ భాగం దీపావళిన 2027న విడుదల కానుంది. ధనుష్ - సోనమ్ కపూర్ నటించిన రాంజానా చిత్రాన్ని ఆగస్టు 1న ఏఐలో క్లైమాక్స్ మార్పుతో రిలీజ్ చేయగా అది అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇలా చేయడాన్ని ధనుష్ ఖండించాడు.
