సూపర్ హిట్ చెత్త బుట్ట స్టోరీకి సీక్వెల్ కన్ఫర్మ్
ఈ మధ్య కాలంలో సీక్వెల్స్ అనేవి సర్వసాదారణం అయ్యాయి. ఎప్పుడో వచ్చిన సూపర్ హిట్ సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ వస్తున్నాయి.
By: Ramesh Palla | 14 March 2026 11:40 AM ISTఈ మధ్య కాలంలో సీక్వెల్స్ అనేవి సర్వసాదారణం అయ్యాయి. ఎప్పుడో వచ్చిన సూపర్ హిట్ సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ వస్తున్నాయి. కొన్ని సినిమాలకు ఏకంగా ప్రాంచైజీలు తీస్తున్నారు. ప్రాంచైజీలో మూడు నాలుగు పార్ట్‌లు సైతం వస్తున్నాయి. తమిళ్‌లో సీక్వెల్స్ కాస్త తక్కువ అని చెప్పాలి. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలతో పోల్చితే స్టార్ హీరోల సీక్వెల్స్ పై ఎక్కువ ఆసక్తి కనబర్చడం లేదు. ఇప్పుడు తమిళ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రెండు సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. విజయ్ సేతుపతిని పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువ చేసిన మూవీ '96'. త్రిష హీరోయిన్‌గా నటించిన ఆ సినిమా సీక్వెల్‌ను చేసేందుకు స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లుగా దర్శకుడు ప్రేమ్ కుమార్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ సీక్వెల్ సంగతి ఇంకా తేలలేదు, కానీ ఈలోపు మహారాజ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విజయ్ సేతుపతి 50వ సినిమా...
విజయ్ సేతుపతి 50వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మహారాజా' సినిమా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. సినిమా విడుదల ముందు వరకు పెద్దగా హడావిడి లేదు. కానీ విడుదల తర్వాత అంతా మహారాజా సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలైంది. ఒక తండ్రి తన కూతురు కోసం చేసిన పనిని ఈ సినిమాలో చూపించారు. సినిమా మొత్తం కథ ఒక చెత్త బుట్ట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ చెత్త బుట్ట వెనుక ఉన్న కథ తెలిసి ప్రేక్షకులు షాక్ అవుతారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు పలు అవార్డ్‌లు వచ్చాయి. సినిమాలో అనురాగ్ కశ్యప్ చేసిన పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. దర్శకుడు నితిలన్ స్వామినాథన్ తీసుకున్న సెన్సిబుల్ సబ్జెక్ట్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇలాంటి ఒక సబ్జెక్ట్‌తో కమర్షియల్ హిట్ ను కొట్టడం కేవలం నితిలన్ కే సాధ్యం అయిందంటూ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు నితిలన్ సీక్వెల్‌కు స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
మహారాజా సినిమాకు సీక్వెల్...
మహారాజా సినిమా వంటి కథకు సాధారణ నటీనటులు అయితే కచ్చితంగా అన్యాయం జరిగేది. విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ వంటి స్టార్స్ పోటీ పడి నటించడం వల్లే సినిమా ఆ స్థాయికి చేరింది. సినిమా విజయంలో కచ్చితంగా నటీనటుల ప్రాధాన్యత ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్ట్‌లో సీక్వెల్‌కి స్కోప్ ఉందన్నట్లుగా క్లైమాక్స్ ను డిజైన్ చేయలేదు. మరి ఇప్పుడు కథ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి మొదలు పెట్టేందుకు కొన్ని పాత్రలు చని పోయాయి. కనుక దర్శకుడు సీక్వెల్ కథను ఎలా డిజైన్ చేశాడు అనేది చూడాలి. ఇప్పటికే దర్శకుడు నితిలన్ రెడీ చేసిన కథకు విజయ్ సేతుపతి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, అతి త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే ఏడాది చివరి వరకు ఈ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
చెత్త బుట్ట చుట్టూ తిరిగే కథ...
చెత్త బుట్ట చుట్టూ తిరిగిన మహారాజా కు సీక్వెల్‌గా రాబోతున్న మహారాజా 2 లో కూడా చెత్త బుట్ట ఉంటుందా అనేది చూడాలి. సినిమాకు సెంటిమెంట్‌గా చెత్త బుట్ట ఉందని, సీక్వెల్‌లో కూడా ఉంటేనే బాగుంటుంది అని విజయ్ సేతుపతి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సేతుపతి తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా ఆయన 50వ సినిమాగా మహారాజాకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే కచ్చితంగా విజయ్ సేతుపతి ఒకటికి పది సార్లు ఆలోచించి ఉంటాడు. కథ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కనుక మహారాజా 2 సినిమా సైతం అంతకు మించి అన్నట్లుగా ఎమోషనల్ టచ్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండే అవకాశం ఉంది. విజయ్ సేతుపతి అభిమానులు ఎక్కువగా కోరుకుంటున్నమహారాజా సీక్వెల్ విషయమై దర్శకుడు నితిలన్ స్వామినాథన్ త్వరలోనే పూర్తి క్లారిటీతో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.
