Begin typing your search above and press return to search.

సీత ఎంపికపై నెటిజనుల్లో తీవ్ర వ్యతిరేకత!

ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.

By:  Srikanth Kontham   |   19 Aug 2026 12:41 PM IST
సీత ఎంపికపై నెటిజనుల్లో  తీవ్ర వ్యతిరేకత!
X

ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇప్ప‌టికే నితీష్ తివారీ తెరకెక్కిస్తోన్న‌ భారీ బడ్జెట్ చిత్రం `రామాయణం`పై చర్చ నడుస్తుండగా తాజాగా మరో చిత్రం `మహాకావ్య శ్రీ రామాయణ` క‌థ రూపంలో తెరపైకి వచ్చింది. అభిషేక్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల కాగా ఇందులో సోషల్ మీడియా సెలబ్రిటీ అంజలి అరోడాను మాతా సీత పాత్రకు ఎంపిక చేయడం పెద్ద దుమారానికి దారితీస్తోంది. `కచ్చా బాదం` పాటతో వైరల్ అయిన ఇన్‌ఫ్లుయెన్సర్ అంజలిని పవిత్రమైన సీతాదేవి పాత్రలో చూడలేమంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రంలో దేవుడి పాత్రలకు సంబంధించిన కాస్టింగ్ పట్ల ప్రేక్షకులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారిని ఇలాంటి పవిత్రమైన ఇతిహాస పాత్రలకు ఎంపిక చేయడం పట్ల పలువురు మండిపడుతున్నారు. ఇది ఘోర కలికాలం అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అగ్రశ్రేణి నటీమణులు నటించాల్సిన పాత్రలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మేకర్స్ చేసిన పెద్ద తప్పిదమని, ఇది సినిమాపై అంచనాలను పూర్తిగా దెబ్బతీస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రంలో రాముడి పాత్రలో దేవ్ శర్మ నటిస్తుండగా ఈ కాస్టింగ్ కూడా విమర్శలపాలవుతోంది. కేవలం కాస్టింగ్ వివాదానికే పరిమితం కాకుండా టీజర్‌లో కనిపించిన కొన్ని చారిత్రక -పౌరాణిక తప్పులపై కూడా నెటిజన్లు కన్నెర్రజేశారు. టీజర్‌లో రామాయణ కాలానికి సంబంధం లేని కొన్ని అంశాలు ..మంత్రాల ప్రస్తావన రావడంతో మేకర్స్ పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ నడుస్తున్నాయి. త్రేతాయుగానికి చెందిన రామాయణంలో ద్వాపరయుగానికి సంబంధించిన శ్రీకృష్ణుడికి సంబంధించిన అంశాలను జోడించడం పట్ల పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా నిర్మాణంలో కనీస పరిశోధన కూడా చేయకుండా ఇలాంటి పొరపాట్లు చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` సినిమా సమయంలో కూడా పౌరాణిక పాత్రల ప్రదర్శన -విజువల్స్ విషయంలో తీవ్ర వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కొత్త సినిమా టీజర్ చూసిన నెటిజన్లు దీన్ని మరో `ఆదిపురుష్` అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పౌరాణిక ఇతిహాసాలను తెరకెక్కించేటప్పుడు చూపించాల్సిన బాధ్యత ..జాగ్రత్త చిత్ర యూనిట్ పాటించలేదని సంచలనం కోసం ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విమర్శల వల్ల సినిమా విడుదలకు ముందే వివాదాల వలయంలో చిక్కుకుంది.

సినిమా రంగానికి సంబంధించిన వర్గాల నుంచి కూడా న‌టీన‌టుల‌ ఎంపికపై భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అంజలి అరోడా ఈ చిత్రం ద్వారానే సిల్వర్ స్క్రీన్‌పై తన అరంగేట్రం చేస్తుండగా.. తొలి సినిమాతోనే ఇంతటి భారీ వివాదాన్ని ఎదుర్కొవాల్సి రావడం గమనార్హం. మేకర్స్ మాత్రం ఈ సినిమా భక్తి, ప్రేమ , త్యాగం ప్రధానంగా సాగుతుందని.. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.