Begin typing your search above and press return to search.

ఇళ‌య‌రాజా వ‌ర్సెస్ మైత్రి కోర్టు గొడ‌వ‌లో ట్విస్టు!

మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన 'డూడ్' సినిమాలో రెండు పాట‌ల‌ను కాపీ చేసార‌ని మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా కోర్టులో దావా వేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   27 Nov 2025 11:00 AM IST
ఇళ‌య‌రాజా వ‌ర్సెస్ మైత్రి కోర్టు గొడ‌వ‌లో ట్విస్టు!
X

మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన 'డూడ్' సినిమాలో రెండు పాట‌ల‌ను కాపీ చేసార‌ని మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా కోర్టులో దావా వేసిన సంగ‌తి తెలిసిందే. త‌న పాట‌ల‌ను ఈ సినిమాలో అనుమ‌తి లేకుండా వినియోగించినందున త‌న‌కు రాయ‌ల్టీ ద‌క్కాల‌ని కూడా ఆయ‌న దావాలో పేర్కొన్నారు. అజిత్ `గుడ్ బ్యాడ్ అగ్లీ` వివాదం త‌ర్వాతా ఇళ‌య‌రాజా మైత్రిపై రెండోసారి కోర్టులో పోరాటం సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి కోర్టు వాద‌న‌లో ఒక‌సారి త‌ప్పు చేసిన నిర్మాణ సంస్థ మ‌రోసారి మ‌ళ్లీ అదే త‌ప్పును రిపీట్ చేసింద‌ని కూడా రాజా త‌ర‌పు న్యాయ‌వాది మైత్రిని కోర్టులో నిల‌దీసే ప్ర‌య‌త్నం చేసారు.

అయితే మ‌ద్రాసు హైకోర్టులో కేసు వాదోప‌వాదాలు కొన‌సాగుతున్న స‌మ‌యంలో మైత్రికి అనుకూలంగా జ‌డ్జి చేసిన‌ వ్యాఖ్య‌లు ఆస‌క్తిని క‌లిగించాయి. డూడ్ సినిమాని థియేట‌ర్ల‌లో ఓటీటీలో ప్ర‌జ‌లు చూసేసిన త‌ర్వాత ఇంత కాలానికి ఎందుకు కేసు వేసారు? అంటూ ఇళ‌య‌రాజా త‌ర‌పు న్యాయ‌వాదిని జ‌డ్జి ప్ర‌శ్నించారు. దాదాపు 30 ఏళ్ల క్రితం సృజించిన పాట‌ల‌ను ఎన్నోసార్లు ప్ర‌జ‌లు వినేసారు. అయినా ఇప్పుడు మ‌రోసారి వాటిని ప్ర‌జ‌ల ముందుకు తెచ్చి వినోదం పంచితే ఇళ‌య‌రాజా ఎలా ప్ర‌భావితం అవుతారు? అని రాజా త‌ర‌పు లాయ‌ర్ ని జ‌డ్జి ప్ర‌శ్నించారు.

అయితే అనుమ‌తి లేకుండా హ‌క్కులు కొనుగోలు చేయ‌కుండా స్వ‌ర‌క‌ర్త ఇళ‌య‌ రాజా పాట‌ల‌ను వినియోగించ‌డం కాపీరైట్ చ‌ట్టం ప్ర‌కారం నేరం అని ఇళ‌య‌రాజా త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. దీంతో న్యాయ‌మూర్తి మైత్రి సంస్థ‌ను ప్ర‌శ్నిస్తూ.. ప‌దే ప‌దే కాపీ రైట్ లేకుండా అలా ఎందుకు చేస్తున్నారు? అని ప్ర‌శ్నించారు. అయితే ఈ పాట‌లను స్వ‌ర‌క‌ర్త‌ సృష్టించేప్ప‌టికి కాపీ రైట్ చ‌ట్టాలు లేవ‌ని, కాపీ రైట్ చ‌ట్టం పున‌రుద్ధ‌రించ‌క ముందే ఈ పాట‌లను సృష్టించార‌ని మైత్రి త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. అయితే ఎకో సంస్థ నుంచి సోని సంస్థ పాట‌ల హ‌క్కుల‌ను పొందింది. మైత్రి సంస్థ సోని నుంచి హ‌క్కులు కొనుగోలు చేసిన‌ట్టు మైత్రి త‌ర‌పు లాయ‌ర్ వాదించారు.

మద్రాస్ హైకోర్టు విచార‌ణ‌లో ఇళ‌య‌రాజా తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్ ప్రభాకరన్ వాదిస్తూ.. నూరు వర్షం, కరుత మచ్చన్ పాట‌లను అనుమతి లేకుండా కొత్త సినిమా డూడ్ లో ఉపయోగించార‌ని కోర్టుకు తెలియజేశారు. నిర్మాతలు ఒరిజిన‌ల్ లిరిక్ ని మార్చారు..ర‌చ‌న‌ను వక్రీకరించి డూడ్ సినిమాలో ఉపయోగించారని, ఒరిజిన‌ల్ సృష్టికర్త ఇళయరాజాకు హాని కలిగించారని లాయ‌ర్ వాదించారు. ఒక‌రి ట్యూన్ తీసుకుని కొత్త ట్యూన్ గా మార్చి ఇదే ఒరిజిన‌ల్ అని మోసం చేస్తున్నార‌ని రాజా లాయ‌ర్ త‌న వాద‌న‌ వినిపించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కోసం కాపీ చేసిన అదే నిర్మాణ సంస్థ అంటూ లాయ‌ర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ దావాలో ఇప్పటికే మధ్యంతర నిషేధం జారీ అయింద‌ని డూడ్ పైనా మ‌ధ్యంత‌ర నిషేధం అమ‌లు చేయాల‌ని వాదించారు.

దావాను తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు

అయితే చట్టబద్ధమైన రక్షణ ఉన్నా కానీ పాత పాటల రీమిక్స్ వెర్షన్‌ను నేటిత‌రం ప్రేక్షకులు ఇష్టపడుతున్నార‌ని మ‌ద్రాసు హైకోర్టు న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత తన పాటలు తిరిగి తెరపైకి వచ్చినందుకు ఇళయరాజా సంతోషంగా ఉండాలని కూడా జ‌డ్జి వ్యాఖ్యానించారు. ఇది కొత్త ట్రెండ్. ప్రేక్షకులు పాత పాటలను కొత్త రూపంలో ఇష్టపడతారు. ఈ సవరించిన వెర్షన్‌లను ఆస్వాధించవద్దని కూడా మీరు ప్రేక్షకులను అడగాలి...నేను దీన్ని ఎన్నిసార్లు చూశానో చెప్ప‌లేను. 30 సంవత్సరాల తర్వాత ఈ పాటలు తిరిగి వచ్చాయి.. అది మంచిది కాదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే ఇళ‌య‌రాజా పాట‌ల‌ను అనుమ‌తి లేకుండా ఉప‌యోగించారా? అని జ‌డ్జి మైత్రి త‌ర‌పు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించ‌గా, కాపీరైట్ చ‌ట్టాలు లేని రోజుల్లో, 30ఏళ్ల క్రితం పాట‌ల‌పై ఇంకా రాజా హ‌క్కును క‌లిగి ఉంటారా? అని కూడా ప్ర‌శ్నించారు. మైత్రి సంస్థ సోని నుంచి డూడ్ పాట‌ల హ‌క్కుల‌ను కొనుగోలు చేసిన విష‌యాన్ని లాయ‌ర్ ప్ర‌స్థావించారు. అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత నిర్మాణ సంస్థ కొత్త సినిమాలోని పాటలను ఉపయోగించిందని ఆయన వాదించారు. సినిమా ఇప్పటికే థియేటర్లలో ప్రదర్శన పూర్తి చేసి ఓటీటీలో విడుదలైందని, ఇళయరాజా కోరినట్లుగా మధ్యంతర ఉత్త‌ర్వు అవసరం లేదని మైత్రి త‌ర‌పు లాయ‌ర్ బాలసుబ్రమణ్యం వాదించారు. ఇరువైపులా పార్టీల వాదనలు విన్న కోర్టు, మధ్యంతర నిషేధ దరఖాస్తుపై ఆదేశాలను రిజర్వ్ చేసింది.