యూనియన్స్ వల్లే నిర్మాతలకు భారం!
సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా సినీ కార్మికులకు, నిర్మాతలకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 11 Aug 2025 3:34 PM ISTసినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా సినీ కార్మికులకు, నిర్మాతలకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. 30% వేతనం పెంచాలి అని సినీ కార్మికుల డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో అంత పెంచలేము అని నిర్మాతలు.. ఇలా ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద నిర్మాతలకు ఇది భారంగా అనిపించకపోయినా.. చిన్న, మధ్య తరహా నిర్మాతలు మాత్రం పూర్తిస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే నిర్మాతల మండలి ఒకే తాటిపై.. ఒకేసారి 30% వేతనం పెంచడం కుదరదు అని స్పష్టంగా చెప్పేసింది.
దాంతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, కార్మికులు సినిమా షూటింగ్లకు హాజరు కాకుండా బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. అందరూ సహకరించాలి అని నిర్మాతలు వేడుకుంటున్నప్పటికీ సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ వేదికగా ప్రసాద్ ల్యాబ్స్ లో దాదాపు 12 మంది నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో పలువురు నిర్మాతలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేయగా.. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్స్ వల్లే అందరూ నష్టపోతున్నారని స్పష్టం చేశారు.
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. "సినిమా అంటేనే క్రియేటివ్ బిజినెస్. చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు ఇండస్ట్రీలో డెమోక్రసీ లేదు అనేదే నా వాదన.. కారణం యూనియన్ రూల్స్ వల్ల. యూనియన్స్ ఎందుకు ఏర్పడ్డాయి అనే విషయం నాకు అనవసరం. కానీ ఈ యూనియన్ వల్ల చిన్న నిర్మాతలు ఎలా నష్టపోతున్నారు అనే విషయాన్ని నేను కళ్లారా చూశాను. ఉదాహరణకు నేను ఒక ఆఫీసు గదిలో హీరో స్నేహితుడితో ఒక చిన్న షార్ట్ చిత్రీకరించాల్సిన సమయం అది. అయితే చిన్న జనరేటర్ అక్కడ పెట్టాల్సి ఉన్నా కూడా యూనియన్ రూల్స్ ఒప్పుకోలేదు. ఆరోజు నాకు కేవలం ఒక్కరే లైట్ మ్యాన్, ఒకరే టెక్నీషియన్ కావాలి. కావాలి.. కానీ దానికి యూనియన్ రూల్స్ ఒప్పుకోవు. ఆరోజు ఏడు మంది లైట్స్ మాన్, మేకప్ డిపార్ట్మెంట్ నుండి ముగ్గురు, హీరో హీరోయిన్ల బట్టలు ఇస్త్రీ చేయడానికి మరో ముగ్గురు, వీరికి ఫుడ్ సర్వ్ చేయడానికి పదిమంది ప్రొడక్షన్ వాళ్లు కావాలి..
యూనియన్ రూల్స్ ప్రకారం బట్టలు ఉతకడానికి, బట్టలు ఇస్త్రీ చేయడానికి కార్మికులను తీసుకోవాలి. ఒక చిన్న ఆఫీస్ రూమ్ లో హీరో, హీరో ఫ్రెండ్ మధ్య తీసే సీన్ కి దాదాపు 80 మంది పనిచేస్తారు. ఇదంతా నిర్మాతకు అదనపు భారమే కదా. అక్కడ కచ్చితంగా పనిచేసేది ఒక నలుగురు లేదా ఐదు మంది ఉంటే చుట్టుపక్కల ఉండేవారు దాదాపు 80 మంది ఉంటారు. ఆ ఖర్చు నిర్మాతకు ఎంత భారంగా మారుతుందో ఒక్కసారి ఎవరైనా ఊహించారా.. ? చిన్న నిర్మాతలకు ఇంతమందికి జీతాలు ఇచ్చే సామర్థ్యం ఎక్కడ ఉంటుంది? ఈ యూనియన్స్ వల్లే నిర్మాతలు నష్టపోతున్నారు.."అంటూ కుండబద్దలు కొట్టేశారు నిర్మాత శ్రీధర్ రెడ్డి. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
