ఒకరిని తొక్కి ఎదగడం నచ్చని నటుడు!
తాజాగా ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకున్నాడు. తన పక్కనే ఉంటూ తనకు రావాల్సిన అవకాశాలను కాజేసేవారు కొందరున్నారన్నాడు.
By: Srikanth Kontham | 7 Jan 2026 8:58 PM ISTఎదగడానికి రకరకాల మార్గాలున్నాయి. కానీ ఆ ఎదుగుదల నిజాయితీదై ఉండాలి. కష్టపడే తత్వం ఉండాలి. ఒళ్లొంచి పని చేయాలి. అప్పుడే ఆ గెలుపుకు ఓ అర్దం ఉంటుంది. అలాంటి గెలుపే చరిత్రలో నిలిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టు మధునందన్ తన కెరీర్ ని అలాగే ప్లాన్ చేసుకున్నాడు. మోసాలు తెలియవు. వెన్ను పోటు తెలియదు. ఒకరి అవకాశాలు లాక్కొవడం అంతకన్నా తెలియదు. నిజాయితీగా వచ్చిన అవకాశాలతో కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన `శంబాల`తో మంచి విజయాన్ని అందుకున్నాడు.
తాజాగా ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకున్నాడు. తన పక్కనే ఉంటూ తనకు రావాల్సిన అవకాశాలను కాజేసేవారు కొందరున్నారన్నాడు. స్నేహం పేరుతో తనకు తెలియకుండా మోసాలు చేసి వాళ్లంతా ఎదిగారని ఆరోపించాడు. ఆ విషయం తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నాడు. అయినా తన మీద తానెప్పుడు నమ్మకం కోల్పోలేదు. తన కష్టాన్ని, శ్రమని నమ్ముకుని ముందుకు సాగుతున్నానన్నాడు. వాళ్లలా ఒకరి కష్టాన్ని దోచుకోవడం తనకు తెలియదన్నాడు. మోసాలు చేయడం అంతకన్నా చేతకాదన్నాడు.
అలాంటి వాళ్లను పట్టించుకుని సమయాన్ని వృద్దా చేయనన్నాడు. ఇలాంటివి ఏవైనా తన వరకూ వస్తే ఒకే గానీ..తనని దాటి కుటుంబం వరకూ వెళ్తే మాత్రం ఉపేక్షించనన్నాడు. కెరీర్ ఆరంభంలో ఉద్యోగం చేస్తూనే సినిమాలు చేసానన్నాడు. ఒకేసారి రెండు పనులు చేయడం అంత సులభం కాదు. రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్ర పోయేవాడినన్నారు. కష్టపడే తత్వం ఉన్నవాడు మాత్రమే అలా చేయగలరన్నాడు. అలా కష్టపడి నాలుగేళ్లు పనిచేసిన తర్వాత 25 లక్షలు సంపాదన మొత్తంతో ఓ వ్యాపారం మొదలు పెడితే ఓ వ్యక్తి నిండా ముంచేసి పోయాడన్నారు. కొన్ని సినిమా అవకాశాలు తన చేజారా వదులుకున్నవి ఉన్నవి. ఓ సినిమా కోసం రెండు నెలలు పాటు అమెరికాలో ఉండటంతో సినిమాలు మానేసి మళ్లీ ఉద్యోగంలో చేరిపోయాను అనుకున్నారు. అలా ఓ పది సినిమాలు కోల్పోయాను అన్నాడు.
మధునందన్ హీరో ప్రెండ్ పాత్రలతో వెలుగులోకి వచ్చిన నటుడు. `నిన్నే ఇష్టపడ్డాను`, `సై`, `ఇష్క్`, `గీతాంజలి` , `గుండెజారి గల్లంతయ్యిందే`, `రభస`, `లై`, `వినయ విధేయ రామ` లాంటి చిత్రాల్లో నటించాడు. `గుండెజారి గల్లంతయ్యిందే` సినిమాతో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ సినిమాలో కమెడియన్ గా అతడి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. అక్కడ నుంచే నటుడిగా అవకాశాలు పెరిగాయి. స్టార్ హీరోల చిత్రాలకు ప్రమోట్ అయ్యాడు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు.
