వెండితెర వెనుక అసలు సిసలు డ్రామా!
నటీనటులు పాత్రల్లో లీనమవడానికి రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. కొందరు సహజ నటనను నమ్మితే?మరికొందరు సాంకేతిక పరిజ్ఞానాన్ని.. గ్లిజరిన్ వంటి సహాయకాలను ఆశ్రయిస్తారు.
By: Srikanth Kontham | 7 Jun 2026 10:00 PM ISTనటీనటులు పాత్రల్లో లీనమవడానికి రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. కొందరు సహజ నటనను నమ్మితే?మరికొందరు సాంకేతిక పరిజ్ఞానాన్ని.. గ్లిజరిన్ వంటి సహాయకాలను ఆశ్రయిస్తారు. అయితే ఒక్కోసారి కెమెరా ముందు సహజత్వం కోసం నటీనటులు తీసుకునే నిర్ణయాలు సెట్స్‌పై ఊహించని ఉత్కంఠ పరిణామాలకు దారితీస్తుంటాయి. దశాబ్దాల క్రితం బాలీవుడ్ సెట్స్‌పై జరిగిన ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటనను సీనియర్ నటి మధుబాల (రోజా ఫేమ్) పంచుకోవడం సంచలనంగా మారింది. దర్శకుడు అనిల్ మట్టూ సారథ్యంలో 1997లో రిలీజ్ అయిన యాక్షన్ డ్రామా `యశ్వంత్`. ఇందులో నానా పటేకర్, మధు భార్యాభర్తలుగా నటించారు.
సినిమా షూటింగ్ సమయంలో కీలకమైన ఎమోషనల్ సీన్‌లో మధు గ్లిజరిన్ ఉపయోగించి ఏడవడానికి సిద్ధపడగా.. నానా పటేకర్ దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. నటనలో షార్ట్‌కట్స్ పనికిరావని సదరు పాత్రలోని బాధను నిజంగా అనుభవిస్తేనే కళ్లలో నీళ్లు రావాలని గట్టిగా పట్టుబట్టారు. ఈ క్రమంలో సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు మధుకు సహజంగా కన్నీళ్లు రాకపోవడంతో నానా పటేకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీన్ మధ్యలో ఆయన మధును ఒక్కసారిగా నిజంగానే చెంపదెబ్బ కొట్టారు. రిహార్సల్స్‌లో లేని ఈ హఠాత్ పరిణామానికి మధు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆ దెబ్బ చాలా బలంగా తగలడంతో ఆమె కళ్లలోంచి నిజంగానే నీళ్లు సుడులు తిరిగాయి. అయితే ఆ షాక్ నుండి తేరుకునే లోపే ముక్కుసూటి మనస్తత్వం ఉన్న మధు కూడా అంతే వేగంగా రియాక్ట్ అయ్యారు. తనకు కోపం రావడం తో ఆవేశంలో తన రిఫ్లెక్స్ కారణంగా నానా పటేకర్‌ను తిరస్కరించకుండా స్పాట్ లోనే తిరిగి గట్టిగా కొట్టానని మధు వివరించారు. ఇలా ఇద్దరు నటీనటుల మధ్య జరిగిన నిజమైన చెంపదెబ్బల మార్పిడి మాస్టర్ షాట్‌లో రికార్డ్ అయిపోయింది. దర్శకుడు అనిల్ మట్టూ ఈ అత్యంత కీలకమైన భార్యాభర్తల సీన్ కోసం ఒక రోజును కేటాయించగా ఇద్దరి నుండి వెలువడిన ఆ రా అండ్ రియలిస్టిక్ ఎమోషన్స్ వల్ల సగం రోజులోనే ఆ సీన్ చిత్రీకరణ పూర్తయిపోయింది.
ఈ సంఘటన తనకు నటనలో సరికొత్త పాఠాన్ని నేర్పిందని మధు పేర్కొన్నారు. సాధారణంగా తాను కెమెరా ఆన్ చేయగానే పాత్రలోకి వచ్చే స్విచ్-ఆన్.. స్విచ్-ఆఫ్ నటినని, కానీ నానా పటేకర్ లాంటి మెథడ్ యాక్టర్ తో పనిచేయడం వల్లే తాను కూడా మెథడ్ యాక్టింగ్ విలువను తెలుసుకోగ లిగానన్నారు. పాత్రలో నటించడం కాకుండా దానితో బ్రతకడం ఎలాగో ఆయన వల్లే అలవడిందని గుర్తు చేసుకున్నారు. సెట్స్‌పై నానా పటేకర్ చూపించే తీవ్రత.. ఆగ్రహం నటన మెరుగుపరచడం కోసమే తప్ప తన పట్ల ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదని మధు స్పష్టం చేశారు. నటీనటులు షాట్ ముగిసిన వెంటనే క్యారెక్టర్ మూడ్ నుండి బయటకు రాకుండా కాపాడుకోవాలనేది ఆయన తాపత్రయమని గుర్తు చేసుకున్నారు.
