హనుమంతుడిపై రాజమౌళి కామెంట్స్.. మాధవీలత లాజికల్ కౌంటర్
ఈ నేపథ్యంలో ప్రముఖ బీజేపీ నాయకురాలు మాధవీలత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ రాజమౌళికి సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు.
By: M Prashanth | 19 Nov 2025 1:16 PM IST'వారణాసి' టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. "నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు", "ఇదేనా హనుమంతుడు నడిపించేది?" అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై భిన్న వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బీజేపీ నాయకురాలు మాధవీలత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ రాజమౌళికి సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు.
వీడియోలో మాధవీలత మాట్లాడుతూ, "మీ సినిమా వీడియో ప్లే కాకపోతే దానికి టెక్నికల్ కారణాలు ఉంటాయి. మీ కష్టాలకు మీరే బాధ్యులు తప్ప, దానికి దేవుడిని నిందించడం ఏంటి?" అని ప్రశ్నించారు. ఆంజనేయస్వామి వెనుకుండి నడిపిస్తారని వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటను రాజమౌళి గుర్తు చేసుకుంటూ, సమస్య రాగానే హనుమంతుడిని అనుమానించడం ఎంతవరకు సబబు అని ఆమె నిలదీశారు.
గతంలో 'బాహుబలి' సినిమా ద్వారా రాజమౌళి కోట్లు సంపాదించారని గుర్తు చేసిన మాధవీలత, ఆ సినిమాలో శివలింగాన్ని ఎత్తుకెళ్లే సీన్ ద్వారా శివయ్యను వాడుకున్నారని ప్రస్తావించారు. "అప్పుడు శివుడిని వాడుకుని డబ్బు సంపాదించారు కదా? మరి ఆ తర్వాత ఏ శివాలయానికైనా వెళ్లి దానధర్మాలు చేశారా? ఆ రోజు శివుడి మీద దండకం చదివారా?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కనీసం డబ్బు సంపాదనకు ఉపయోగపడ్డాడు కదా అని దేవుడి పట్ల కృతజ్ఞత చూపించాల్సింది పోయి, ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.
కుమ్మరి కుండలు చేసే వారి వస్తువులను, కంసాలి పనిముట్లు, డాక్టర్ సర్జికల్ వస్తువులు.. ఇలా ప్రతి వృత్తిలోనూ వాడే సాధనాలను దైవంగా భావించి పూజిస్తారని మాధవీలత గుర్తు చేశారు. సినిమా అనేది రాజమౌళికి వృత్తి అయినప్పుడు, ఆ వృత్తిని గౌరవించడం నేర్చుకోవాలన్నారు. అంతేకానీ, ఏదో చిన్న టెక్నికల్ గ్లిచ్ రాగానే దేవుడిపై నిందలు వేయడం చిన్నపిల్లల మనస్తత్వంలా ఉందని ఎద్దేవా చేశారు. సమస్య తీరిపోగానే మళ్ళీ చిన్నపిల్లాడిలా ఎగిరి గంతేయడం చూస్తుంటే, ఆయనలో నిలకడ లోపించిందని ఆమె వ్యాఖ్యానించారు.
రాజమౌళి లాంటి స్థాయి ఉన్న వ్యక్తి సమాజానికి ఆదర్శంగా ఉండాలని, ఆయన మాట్లాడే మాటలు ఎంతోమందిని ప్రభావితం చేస్తాయని మాధవీలత హితవు పలికారు. ఇలాంటి బాధ్యతారాహిత్యపు మాటలు మాట్లాడటం వల్ల సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రజలు సెలబ్రిటీలను గమనిస్తుంటారని, చేతన్యం పొందుతారని, కాబట్టి మాట్లాడే ముందు ఆచి తూచి వ్యవహరించాలని సూచించారు.
మొత్తానికి మాధవీలత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి వ్యాఖ్యలను సమర్ధించేవారు కొందరైతే, మాధవీలత ప్రశ్నల్లో లాజిక్ ఉందనేవారు మరికొందరు. ఏది ఏమైనా, 'వారణాసి' ఈవెంట్ గ్లిచ్ ఇప్పుడు ఒక స్పిరిచువల్ డిబేట్ కు దారి తీసింది. మరి రాజమౌళి టీమ్ ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
