17 ఏళ్ల తర్వాత అదే ప్రమాదంలో హీరో..!
జమ్మూ కశ్మీర్‌లో హీరో ఆర్ మాధవన్ చిక్కుకున్నాడు. ఆయన గత కొన్ని రోజులుగా తిరుగు ప్రయాణం కావాలని ఎదురు చూస్తున్నారు.
By: Ramesh Palla | 28 Aug 2025 1:17 PM ISTతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులూ వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో జనాలు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల గురించి తెలుగు మీడియా ఎక్కువ కవరేజ్ చేస్తున్న కారణంగా జమ్ము కశ్మీర్ లో వర్షాల, వరదల కారణంగా ఎక్కువగా తెలియడం లేదు. అక్కడ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వేలాది మందిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాల కారణంగా విమానాలు నడవడం లేదు, అక్కడకు వెళ్లాలి అనుకున్న వారు, అక్కడ నుంచి రావాలి అనుకున్న వారు ప్రయాణాలు చేయలేని పరిస్థితి అక్కడ ఉంది.
షూటింగ్ కోసం జమ్మూ కశ్మీర్ వెళ్లిన మాధవన్
జమ్మూ కశ్మీర్‌లో హీరో ఆర్ మాధవన్ చిక్కుకున్నాడు. ఆయన గత కొన్ని రోజులుగా తిరుగు ప్రయాణం కావాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన భారీ వర్షాల కారణంగా విమానం ఎక్కలేక పోయారు. ఎయిర్ పోర్ట్ మూసి వేయడంతో పాటు, ఇతర ట్రాన్స్ పోర్ట్ సదుపాయం కూడా లేకపోవడంతో అక్కడ నుంచి బయట పడలేక పోతున్నాడు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడకు వెళ్లిన మాధవన్ తీవ్ర అసౌకర్యంకు గురి అవుతున్నట్లు చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా ద్వారా తాను పడుతున్న అవస్థలను నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా తాను గతంలోనూ పడ్డ ఇబ్బంది గురించి ఈ సందర్భంగా మాధవన్ ఇన్‌స్టాగ్రామ్ ఆడియో నోట్ ద్వారా షేర్ చేశాడు. మాధవన్ అభిమానులు ప్రస్తుతం ఆందోళనతో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు.
త్రి ఇడియట్స్ షూటింగ్ సమయంలో వరదలు
ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో వరదల కారణంగా మాధవన్ చిక్కుకు పోయాడు. ఇదే మాధవన్ 2008లో లద్దాఖ్‌లో వర్షాలు, వరదల కారణంగా చిక్కుకు పోయాడట. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ ఘటన జరిగిందని, తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను అని, కానీ నేను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా ఇలా జరగడం ఇబ్బందిగా అనిపిస్తుందని అన్నాడు. ఇంత భయంకర వర్షపాతం నమోదు అయ్యి, వరదలు పారుతున్నా కూడా జమ్ము కశ్మీర్ ఖచ్చితంగా సుందరమైన ప్రదేశం అనడంలో సందేహం లేదని, ఈరోజు అయినా వర్షం తగ్గి విమాన రాకపోకలు సక్రమంగా ఉంటే, నేను నా ఇంటికి చేరుకుంటాను అని మాధవన్ తన వాయిస్ నోట్‌లో చెప్పుకొచ్చాడు. గతంలో త్రి ఇడియట్స్ షూటింగ్ కోసం లద్దాఖ్ వచ్చిన సమయంలో ఇలాగే చిక్కుకు పోయి చాలా రోజులు ఉండాల్సి వచ్చిందని అన్నాడు.
మాధవన్ కోసం అభిమానుల ఎదురు చూపులు
మాధవన్ జమ్ము కశ్మీర్‌లో చిక్కుకు పోవడంతో పలువురు ఆయన పరిస్థితిపై ఆరా తీశారు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ, పోస్ట్ లు చేస్తూ మాధవన్ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉన్నాయి. దాంతో స్థానికులు పదుల కిలో మీటర్ల దూరం ప్రయాణించి సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మాధవన్ ప్రస్తుతానికి సురక్షిత ప్రాంతంలోనే ఉన్నట్లుగా ఆయనే చెప్పారు. కనుక వర్షాలు తగ్గి, వరదలు తగ్గుముఖం పడితే అప్పుడు విమాన రాకపోకలు పునః ప్రారంభం అవుతాయి. అప్పుడు మాధవన్ తన ఇంటికి చేరుతాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. మాధవన్ గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారు.
