ప్రముఖ తమిళ నటుడు క్యాన్సర్‌తో మృతి
నటుడు, సంగీత గురువు మదన్ బాబ్ మృతి చెందారని చెన్నై వర్గాల సమాచారం. తనదైన హాస్యం, నటనలో విలక్షణ శైలితో ఆకట్టుకున్న మదన్ బాబ్ ని మదన్ బోబ్ అని కూడా పరిశ్రమ వ్యక్తులు పిలుస్తారు.
By: Sivaji Kontham | 2 Aug 2025 11:43 PM ISTనటుడు, సంగీత గురువు మదన్ బాబ్ మృతి చెందారని చెన్నై వర్గాల సమాచారం. తనదైన హాస్యం, నటనలో విలక్షణ శైలితో ఆకట్టుకున్న మదన్ బాబ్ ని మదన్ బోబ్ అని కూడా పరిశ్రమ వ్యక్తులు పిలుస్తారు. నవ్వులు పూయించే ట్రేడ్ మార్క్ స్మైల్‌తో అతడు అందరికీ గుర్తున్నాడు. బోబ్ స్వభావానికి తగ్గట్టు `పున్నగై మన్నన్` (చిరునవ్వుల రాజు) అని పిలుపందుకున్నాడు.
దాదాపు 600 పైగా చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన మదన్ బోబ్ నటుడిగా మాత్రమే అందరికీ తెలుసు. సంగీత గురువు అనే విషయం తెలిసింది తక్కువ. అతడి అసలు పేరు ఎస్ కృష్ణమూర్తి. కానీ పరిశ్రమలో మదన్ బాబ్‌గా పిలిచారు. మదన్ బాబ్ మరణానికి కారణం క్యాన్సర్ అని తెలుస్తోంది.
కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించాడు మదన్. తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన అతడు కె బాలచందర్ దర్శకత్వం వహించిన వానమే ఎల్లై (1992)తో తెరకు పరిచయమయ్యారు. తెనాలి (2000)లో డైమండ్ బాబు.. ఫ్రెండ్స్ (2000)లో మేనేజర్ సుందరేశన్ పాత్రల్లో అద్భుతంగా నటించాడు. తేవర్ మగన్, సతీ లీలావతి, చంద్రముఖి, ఎథిర్ నీచల్ తదితర చిత్రాల్లో నటించాడు. తెలుగులో భామనే సత్యభామనే, బంగారం చిత్రాలతో పాటు, మలయాళంలో భ్రమరం, సెల్యులాయిడ్ తదితర చిత్రాల్లో నటించాడు.
అయితే అతడు నటుడిగా మాత్రమే బయటి ప్రపంచానికి సుపరిచితం. కానీ సంగీత దర్శకుడిగా కెరీర్ సాగించాడనే విషయం ఎవరికీ తెలీదు. స్వరమాంత్రికుడు రెహమాన్ కి సంగీత గురువు అని కూడా తెలుస్తోంది. ఎస్ రామనాథన్, విక్కు వినాయకరామ్, హరిహర శర్మ వంటి వారి వద్ద పాశ్చాత్య శాస్త్రీయ, కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందాడు.
