రతన్ టాటా స్ఫూర్తిదాయక ప్రస్థానంపై సిరీస్ టాక్ ఎలా ఉందంటే?
పాత తరం వ్యాపార విలువలకు.. ఆధునిక సాంకేతికతకు మధ్య జరిగిన ఘర్షణను ఈ సిరీస్‌లో ప్రధాన సంఘర్షణగా మలిచారు.
By: Sivaji Kontham | 5 Jun 2026 4:00 PM ISTభారతీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా జీవిత ప్రస్థానం- టాటా సామ్రాజ్య అద్భుత ఎదుగుదల ఆధారంగా పేర్ల మార్పుతో తెరకెక్కిన `మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ` ప్రస్తుతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక వ్యక్తి సున్నా నుండి ప్రపంచ స్థాయి దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు? అనే అంశాన్ని ఈ వెబ్ సిరీస్ అత్యంత ప్రభావితంగా ఆవిష్కరించింది. ప్రధానంగా రతన్ టాటా హయాంలో టాటా గ్రూప్ సాధించిన చారిత్రాత్మక విజయాలు, ఒక స్వదేశీ బ్రాండ్‌ను అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆయన పడిన శ్రమను ఈ కథలో ప్రధానంగా ప్రతిబింబించారు.
ఈ సిరీస్‌లో పాత్రల పేర్లు అధికారికంగా మార్చినా కానీ.. జిమ్ సర్బ్ పోషించిన పాత్ర రతన్ టాటా జీవితంలోని కీలక ఘట్టాలను, ముఖ్యంగా టాటా నానో ప్రాజెక్ట్ .. అంతర్జాతీయ కంపెనీల కొనుగోలు వంటి అంశాలను గుర్తుకు తెస్తుంది. అదేవిధంగా నసీరుద్దీన్ షా పాత్ర జె.ఆర్.డి టాటా వంటి మహోన్నత మార్గదర్శకుల నీడను స్ఫూర్తిగా తీసుకుని రూపుదిద్దుకుంది. రచయిత ఈ కథను కేవలం ఒక బయోపిక్‌లా కాకుండా... `మేడ్ ఇన్ ఇండియా` అనే నినాదం వెనుక ఉన్న భావోద్వేగాన్ని, గ్లోబల్ మార్కెట్‌లో ఒక భారతీయ సంస్థ ఎదుర్కొన్న వివక్షను.. అంతర్గత కుట్రలను దాటుకుని `టైటాన్`లా ఎలా నిలబడింది? అనే కోణంలో అద్భుతమైన స్క్రిప్ట్‌తో సినిమా తీసారు.
పాత తరం వ్యాపార విలువలకు.. ఆధునిక సాంకేతికతకు మధ్య జరిగిన ఘర్షణను ఈ సిరీస్‌లో ప్రధాన సంఘర్షణగా మలిచారు. ఇది కేవలం ఒక కార్పొరేట్ డ్రామాగా మాత్రమే కాకుండా, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒక గొప్ప స్ఫూర్తిదాయక యాత్రలా సాగుతుంది. జిమ్ సర్బ్, నసీరుద్దీన్ షా వంటి మేధావులైన నటులు తమ పరిణతి చెందిన నటనతో పాత్రలకు ప్రాణం పోయడం వల్ల... ఇది ఒక సాధారణ వెబ్ సిరీస్‌లా కాకుండా ఒక విశిష్టమైన డాక్యు-డ్రామా అనుభూతిని వీక్షకులకు కలిగిస్తోంది.
డిజిటల్ స్క్రీన్‌పై సంచలనం:
పాపులర్ ఓటీటీలో విడుదలై వీక్షకుల నుండి అద్భుతమైన సానుకూల స్పందనను సొంతం చేసుకుంటోంది `మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ` వెబ్ సిరీస్. సింపుల్ గా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా నిజాయితీతో కూడిన కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ 2026 బెస్ట్ ఇండియన్ ఓటీటీ రిలీజ్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. మితిమీరిన డ్రామా జోలికి వెళ్లకుండా వాస్తవ సంఘటనలను అత్యంత సహజంగా, నమ్మదగిన రీతిలో ప్రదర్శించారనే ప్రశంసలు దక్కుతున్నాయి. సిరీస్ ఆద్యంతం ఆకట్టుకునే కథనం.. స్థిరమైన వేగంతో సాగే స్క్రీన్‌ప్లే .. బలమైన పాత్రల చిత్రణ కారణంగా ఈ సిరీస్ కొందరు వీక్షకులకు గతంలో సంచలన విజయం సాధించిన `స్కామ్ 1992`ను గుర్తుకు తెస్తోంది.
కార్పొరేట్ వివాదాల తళుకుబెళుకుల కంటే నిజమైన మానవీయ సంబంధాలు, హ్యూమన్ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ఈ సిరీస్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన జిమ్ సర్బ్, నసీరుద్దీన్ షాల నటన ఈ కథకు బలమైన భావోద్వేగ పునాది వేసింది. ఒక పారిశ్రామిక సామ్రాజ్యాన్ని మొదటి నుండి ఎలా నిర్మించారనే స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని తమ అద్భుత నటనతో.. స్క్రీన్ ప్రెజెన్స్‌తో వీరు ఆవిష్కరించారు. వీరిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ కీలక సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇది రతన్ టాటా కథ అని చెప్పకుండానే టాటాల స్టోరీని సిరీస్ రూపంలో అద్భుతంగా రూపొందించారని మేకర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు.
