బాక్సాఫీస్ మ్యాడ్ రష్.. ఇంకో వారం
మీడియా, సోషల్ మీడియా ఫోకస్ కూడా ఏ ఒక్క సినిమా మీదా నిలవదు. అయినా సరే.. కొన్నిసార్లు మరో ఆప్షన్ లేక ఒకేసారి ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసేస్తుంటారు.
By: Garuda Media | 7 Sept 2026 6:26 PM ISTపెద్ద సినిమా అయితే.. మిడ్ రేంజ్ సినిమాలైతే రెండు.. చిన్న సినిమాలైతే మూడు.. సినిమాల సంఖ్య అంతకుమించితే బాక్సాఫీస్ దగ్గర కొంచెం ఇబ్బంది తప్పదు. ప్రేక్షకులకు ఆప్షన్లు ఎక్కువైతే ఈ సినిమా చూడాలో తెలియని అయోమయం నెలకొంటుంది. మీడియా, సోషల్ మీడియా ఫోకస్ కూడా ఏ ఒక్క సినిమా మీదా నిలవదు. అయినా సరే.. కొన్నిసార్లు మరో ఆప్షన్ లేక ఒకేసారి ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసేస్తుంటారు.
గత వీకెండ్లో అరడజను సినిమాల దాకా రిలీజయ్యాయి. అందులో ఏదీ పూర్తి సంతృప్తికర ఫలితాన్నందుకోలేదు. ‘రోమాంచకం’ పర్వాలేదనిపిస్తే.. మిగతా సినిమాలేవీ ప్రభావం చూపించలేకపోయాయి. కొత్త సినిమాలకు ‘ఇరుముడి’ రూపంలో పెద్ద అడ్డంకి ఉండనే ఉంది. ఆ సినిమా మాస్ బ్యాటింగ్ చేస్తుండగా.. దాన్నుంచి ప్రేక్షకుల దృష్టి మళ్లించి తమ చిత్రాలకు రప్పించడం సవాలుగా మారుతోంది.
అయినా సరే.. ఈ వీకెండ్లో కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాడ్ రష్ చూడబోతున్నాం. డబ్బింగ్‌వి కలుపుకుని ఈ వారం ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సితార ఎంటర్టైన్మెంట్స్ వారి ‘ఎపిక్’ గురించి. నైంటీస్ మిడిల్ క్లాస్ ఫేమ్ ఆదిత్య హాసన్ రూపొందించిన తొలి ఫీచర్ ఫిలిం ఇది. ‘బేబీ’ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. దీనిపై యూత్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ శుక్రవారం రిలీజవుతున్న సినిమాకు ముందు రోజే ప్రిమియర్స్ పడుతున్నాయి.
ఇక గురువారం నాడు రవితేజ సోదరుడి కొడుకు మాధవ్ నటించిన రూరల్ డ్రామా ‘మారెమ్మ’ రిలీజవుతోంది. అదే రోజు తెలుగు నటుడు సుహాస్ కీలక పాత్ర పోషించిన తమిళ అనువాద చిత్రం ‘మండాడి’ విడుదల కానుంది. ఇదే రోజు కార్తి నటించిన క్రేజీ మూవీ ‘సర్దార్-2’ తెలుగులోనూ మంచి అంచనాలతో విడుదల కాబోతోంది. ఇక శుక్రవారం నాడు సుమంత్ నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ విడుదల కాబోతోంది. ఈ ఐదు సినిమాల్లో అన్నీ వేటికవే భిన్నంగా ఉన్నప్పటికీ.. ఇంత పోటీలో ఏది సత్తా చాటుకుంటుందన్నది చూడాలి.
