గోపీచంద్ మరొకటి.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ పక్కానా?
మ్యాచో స్టార్ గోపీచంద్ తన కెరీర్ లో కీలకమైన దశలో ఉన్నారని చెప్పాలి. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన, వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతూ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారు.
By: M Prashanth | 3 May 2026 6:35 PM ISTమ్యాచో స్టార్ గోపీచంద్ తన కెరీర్ లో కీలకమైన దశలో ఉన్నారని చెప్పాలి. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన, వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతూ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన మరో చిత్రం ప్రారంభమైంది. ఆదివారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఆ ప్రాజెక్ట్ లాంఛనంగా మొదలైంది.
ఆ చిత్రాన్ని యాత్ర, ఆనందో బ్రహ్మ వంటి వైవిధ్యమైన సినిమాలను నిర్మించిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ కు ప్రాధాన్యం ఉన్న ఆ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న వెంకట్, గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేసినట్లు సమాచారం.
చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మండుతున్న ఆకాశం మధ్య కొండపై నిలబడి ఉన్న బ్లాక్ పాంథర్ విజువల్ తో సినిమా టోన్ ఎంత ఇంటెన్స్ గా ఉండబోతోందో చెబుతోంది. "పులి వేట మొదలైంది.. గర్జనకు ముందు ఒక ఆచారం ఉంటుంది" అనే క్యాప్షన్ కథలో ఉన్న ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. ఈ నేపథ్యంతో ఇది మైథికల్ టచ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినిమాలో గోపీచంద్ సరసన అనార్కలి హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. కథ, పాత్రల పరంగా కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు చిత్రబృందం సిగ్నల్స్ ఇస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. సాంకేతిక విభాగం కూడా ఆ ప్రాజెక్ట్ కు పెద్ద ప్లస్ గా మారనుంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా,
సినిమాటోగ్రఫీ బాధ్యతలను శామ్ దత్ చేపట్టారు.
ఇక ఎడిటింగ్ ను జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ ను రామకృష్ణ-మౌనికలు చూస్తున్నారు. అదే సమయంలో గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భరత వర్ష అనే పీరియడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే కొత్త ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అదేవిధంగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కుమార్ సాయి దర్శకత్వంలో మరో యాక్షన్ ప్రాజెక్ట్ కూ గోపీచంద్ కమిట్ అయ్యారు.
ఏదేమైనా గోపీచంద్ ఇప్పుడు పూర్తిగా యాక్షన్ జోనర్ పైనే దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, టెక్నికల్ గా స్ట్రాంగ్ టీమ్స్ తో కలిసి పని చేయడం ద్వారా తన మార్కెట్ ను మళ్లీ నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు. వరుసగా మూడు ప్రాజెక్టులు లైన్లో ఉండటం, అందులో ప్రతి ఒక్కదానిలో కొత్తదనం కనిపించడం ఆయన కమ్ బ్యాక్ పై అంచనాలను పెంచుతోంది. అయితే ఆ ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. అభిమానులు మాత్రం ఈసారి ఆయన హిట్ కొడతారనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.
