Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: బంగారం టూమచ్ వయొలెంట్.. సామ్ కొత్త యాంగిల్‌కి మైండ్ బ్లాంక్!

రాజ్ అండ్ డీకే మరోసారి తమ పెన్ పవర్‌తో సమంతకు గ్యారెంటీ బ్లాక్‌బస్టర్‌ను రాసిపెట్టారని ఎంపిక చేసుకున్న క‌థ‌, ట్రైలర్ లోని డైలాగులు, స్క్రీన్‌ప్లే స్పష్టం చేస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   26 May 2026 6:48 AM IST
ట్రైలర్ టాక్: బంగారం టూమచ్ వయొలెంట్.. సామ్ కొత్త యాంగిల్‌కి మైండ్ బ్లాంక్!
X

సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ తన సొంత బ్యానర్ `ట్రలాలా మూవింగ్ పిక్చర్స్` పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం `మా ఇంటి బంగారం`. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. `ఓ బేబీ` వంటి సూపర్ హిట్ తర్వాత సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలైన నిమిషాల్లోనే వైరల్‌గా మారిన ఈ ట్రైలర్ ఒక సరికొత్త ట్విస్ట్‌తో కూడిన మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కంటెంట్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ వివరాల్లోకి వెళితే.. ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి పద్ధతిగా, అమాయకంగా అడుగుపెట్టిన ఒక పెద్దింటి కోడలి పాత్రలో సమంత పరిచయమవుతుంది. ఇంట్లో అందరినీ సంతుష్టులను చేస్తూ.. ఎంతో సాఫ్ట్ గా మాట్లాడే ఈ `బంగారం` వెనుక ఎవరికీ తెలియని ఒక పవర్‌ఫుల్ అండర్‌వరల్డ్ మాస్ యాక్ష‌న్ క్వీన్ లేదా చిద‌క్కొట్టే గతముందనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తన గత జీవితాన్ని అత్తమామలకు తెలియకుండా దాచిపెట్టి సాధారణ గృహిణిగా బతకాలని పాపం బంగారం చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఫ్యాక్షన్ గొడవల్లో ఇరుక్కున్న ఆ కుటుంబానికి కొన్ని దుష్టశక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఈ `బంగారం` అసలు స్వరూపం బయటపడుతుంది.

ఇంటి పనులే కాదు.. అవసరమైతే రక్తపాతం సృష్టించి వయొలెంట్‌గా రెస్పాండ్ అవ్వడంలో ఈ బంగారం రూటే వేరని సమంత యాక్షన్ మోడ్ నిరూపిస్తోంది. ``నా ప్రాణం అడ్డుపెట్టైనా.. నా ఫ్యామిలీకి ఏమీ కాకుండా చూసుకుంటా`` అంటూనే శత్రువుల ప్రాణాలు తీసే సీన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. తుపాకులు పేల్చడంలో, కత్తిని గురిచూసి విసరడంలో, దొరికిన వస్తువును దొరికినట్టు అందుకుని గూండాలను చితకబాదడంలో సమంత చూపించిన రౌద్రరూపం వేరే లెవెల్‌లో ఉంది. ఇంతకీ ఈ బంగారం ఆ ఇంటిని కాపాడటానికి వచ్చిన ఏ స్పెషల్ ఆఫీసరో లేదా త‌న‌ వెనుక ఏ పెద్ద గ్యాంగ్ ఉందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ చిత్రానికి సమంత భర్త, ప్రముఖ ఫిలింమేకర్ రాజ్ నిడిమోరు కథను అందించడం విశేషం. రాజ్ అండ్ డీకే మరోసారి తమ పెన్ పవర్‌తో సమంతకు గ్యారెంటీ బ్లాక్‌బస్టర్‌ను రాసిపెట్టారని ఎంపిక చేసుకున్న క‌థ‌, ట్రైలర్ లోని డైలాగులు, స్క్రీన్‌ప్లే స్పష్టం చేస్తున్నాయి. అటు నందినీ రెడ్డి కేవలం క్లాస్ సినిమాలే కాదు.. ఇలాంటి హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను కూడా అద్భుతంగా హ్యాండిల్ చేయగలనని తన డైరెక్షన్ ఎబిలిటీని నిరూపించుకున్నారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

మొత్తానికి ఫ్యామిలీ సెంటిమెంట్‌ను, ఊరమాస్ యాక్షన్‌ను సమపాళ్లలో మిక్స్ చేసిన `మా ఇంటి బంగారం` ట్రైలర్ టాలీవుడ్‌లో సరికొత్త వైబ్స్ క్రియేట్ చేస్తోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా జూన్ 19న థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది ఒక పండగ లాంటి అదిరిపోయే ట్రీట్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.