సామ్ 'ఫ్రెండ్'కు సరైన ఛాన్సులు పడితే తిరుగులేదా?
సినిమాల్లో కొన్నిసార్లు హీరో, హీరోయిన్ల కంటే ఒక చిన్న రోల్ ప్రేక్షకుల మదిలో ఎక్కువ రోజులు నిలిచిపోతుంది. తాజాగా రిలీజైన మా ఇంటి బంగారం విషయంలో కూడా అలాంటి చర్చ జరుగుతోంది.
By: M Prashanth | 21 Jun 2026 9:13 AM ISTసినిమాల్లో కొన్నిసార్లు హీరో, హీరోయిన్ల కంటే ఒక చిన్న రోల్ ప్రేక్షకుల మదిలో ఎక్కువ రోజులు నిలిచిపోతుంది. తాజాగా రిలీజైన మా ఇంటి బంగారం విషయంలో కూడా అలాంటి చర్చ జరుగుతోంది. స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాలో ఆమె ఫ్రెండ్ కిరణ్మయి రోల్ పోషించిన మంజూష ముక్కవిల్లి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. మూవీ అంతా సమంత చుట్టూనే తిరిగినా, ఆమెకు తోడుగా కనిపించిన కిరణ్మయి రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆ రోల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో కనిపించిన ప్రతిసారి తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో మంజూష ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ట్రైలర్ విడుదలైనప్పుడే లెట్స్ కమాన్ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే సినిమా విడుదల తర్వాత ఆ రోల్ ఎఫెక్ట్ మరింత పెరిగింది. కథలో కొన్ని ఎమోషనల్ సీన్స్ సాగుతున్నప్పటికీ, మంజూష కనిపించిన సందర్భాల్లో ప్రేక్షకులను నవ్వించడం విశేషం. అందుకే ఇప్పుడు ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.
మంజూష ముక్కవిల్లి సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పటి లెజెండరీ యాక్ట్రెస్ లు సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ వంటి వారి ఎక్స్ప్రెషన్స్ ను ఇమిటేట్ చేస్తూ చేసిన రీల్స్ తో ఆమెకు స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి యాక్ట్రెస్ ల మేనరిజమ్స్ ఇప్పటి జెనరేషన్ కు పరిచయం చేసే విధంగా ఆమె రూపొందించిన వీడియోలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఇదే అంశం దర్శకురాలు నందినీ రెడ్డి దృష్టిని ఆకర్షించినట్టు తెలుస్తోంది. సూర్యకాంతం యాక్టింగ్ కు అభిమానిగా పేరున్న నందినీ, మంజూష రీల్స్ చూసి ఆకట్టుకున్నారని సమాచారం. ఆ తర్వాత కిరణ్మయి రోల్ కోసం ఆమెను పలుమార్లు ఆడిషన్ చేసి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సినిమా రిజల్ట్ చూస్తే ఆ నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతోంది.
నిజానికి ఇలాంటి పాత్రకు ఇప్పటికే పేరున్న యాక్ట్రెస్ ను తీసుకోవడం దర్శకులకు ఈజీనే. కానీ కొత్త ఫేస్ ను సెలెక్ట్ చేయడం వల్ల ప్రేక్షకులు పాత్రతో మరింత సహజంగా కనెక్ట్ అయ్యారు. ఎలాంటి స్టార్ ఇమేజ్ లేకుండా పాత్రలో పూర్తిగా కలిసిపోవడం మంజూషకు ప్లస్ అయింది. అందుకే ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు కిరణ్మయిని పాత్రగానే గుర్తు పెట్టుకుంటున్నారు.
ఇటీవల తెలుగు సినిమాల్లో కొత్త క్యాస్టింగ్ కు అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే అవకాశం రావడం ఒక విషయం అయితే, వచ్చిన ఛాన్స్ ను యూజ్ చేసుకోవడం మరో విషయం. మా ఇంటి బంగారంలో మంజూష అదే చేసి చూపించింది. చిన్న పాత్ర అయినప్పటికీ తన రోల్ తో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత మంజూషకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో ఆమెకు మంచి ఫ్యూచర్ కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు. సరైన పాత్రలు, సరైన డైరెక్టర్లు దొరికితే మంజూష ముక్కవిల్లి టాలీవుడ్ లో మరింత గుర్తింపు సంపాదించుకోవడం ఖాయమనే చెప్పాలి. ప్రస్తుతం ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే.. సామ్ ఫ్రెండ్ కు సరైన ఛాన్సులు దక్కితే నిజంగానే తిరుగులేదనే మాట వినిపిస్తోంది.
