చేతులు మరిన స్టార్ హీరోయిన్ మూవీ?
అయితే సినిమా అనౌన్స్‌మెంట్ తర్వాత మళ్లీ ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.
By: Sravani Lakshmi Srungarapu | 25 Aug 2025 12:32 PM ISTఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరి చేతిలోకి వెళ్లడం కామన్. కానీ చాలా తక్కువ సార్లు, అరుదుగా మాత్రమే ఒక డైరెక్టర్ తో చేయాలనుకున్న సినిమా చేతులు మారి మరొకరు డైరెక్ట్ చేయడం చూస్తుంటాం. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరి హర వీరమల్లు సినిమాకు ఇలానే జరిగింది. ముందు క్రిష్ దర్శకత్వంలో మొదలైన వీరమల్లు తర్వాత ఆయన తప్పుకోవడంతో ఏఎం జ్యోతి కృష్ణ ఆ బాధ్యతలు తీసుకుని దాన్ని పూర్తి చేశారు.
క్రైమ్ డ్రామాలో సమంత
ఇప్పుడు మరో స్టార్ చేస్తోన్న సినిమాకు కూడా అలానే డైరెక్టర్ మారినట్టు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రానున్న మా ఇంటి బంగారం. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలమైంది. సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాను అనౌన్స్ చేయగా ఆ లుక్ లో సమంత గన్ పట్టుకుని చాలా భయంకరమైన లుక్ లో కనిపించడంతో ఆ సినిమా ఓ క్రైమ్ డ్రామాగా రానుందని అందరూ అనుకున్నారు.
అలానే ఆగిపోయిన ప్రాజెక్టు
అయితే సినిమా అనౌన్స్‌మెంట్ తర్వాత మళ్లీ ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా పరిస్థితేంటా అని కూడా అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ సినిమా ముందుకు కదులుతుందని సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం మా ఇంటి బంగారం ప్రాజెక్టు చేతులు మారిందని తెలుస్తోంది. ఈ సినిమాను ముందు సమంత కొత్త డైరెక్టర్ తో ప్లాన్ చేయగా, ఇప్పుడు ఆ ప్రాజెక్టు సమంత ఫ్రెండ్ మరియు డైరెక్టర్ అయిన నందినీ రెడ్డి చేతుల్లోకి వెళ్లిందని సమచారం.
ముచ్చటగా మూడోసారి నందినితో
అందులో భాగంగానే నందిని ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పై మళ్లీ వర్క్ చేస్తుందని, ఆ వర్క్స్ లోనే నందినీ బిజీగా ఉన్నారని అంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే దాన్ని సెట్స్ కు తీసుకెళ్లాలని సమంత చూస్తున్నారట. సొంత బ్యానర్ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో సమంతనే ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా గతంలో సమంత, నందిని రెడ్డి కలయికలో జబర్దస్త్, ఓ బేబి సినిమాలు రాగా ఓ బేబి సినిమా చాలా మంచి హిట్ గా నిలిచింది.
