బంగారం విజయంతో 'క్యూ'లో కొత్త అవకాశాలా?
టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ -ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకురాలు నందిని రెడ్డి.
By: Srikanth Kontham | 24 Jun 2026 1:01 PM ISTటాలీవుడ్‌లో ఫీల్ గుడ్ -ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకురాలు నందిని రెడ్డి. `అలా మొదలైంది`, `ఓ బేబీ` వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నందిని గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక గ్యాప్ తీసుకున్నారు. అయితే ఇటీవలి ఆమె అందించిన ` మా ఇంటి బంగారం` సాధించిన విజయం ఆమె కెరీర్‌ను మళ్లీ గాడిన పడేలా చేస్తోందిత. ఈ భారీ విజయంతో నందిని రెడ్డి టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.
చిత్ర పరిశ్రమలో దర్శకుడికి సక్సెస్ ఎంత ముఖ్యమో? ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస విజయాలతో దూసుకుపోయే సమయంలో ఒక్క పరాజయం ఎదురైనా సమీకరణాలు మారిపోతుంటాయి. నందిని రెడ్డి కూడా గతంలో కొన్ని ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కొత్త సినిమాలను పట్టాలెక్కించడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఈ విరామం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపిస్తుందా ? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
కాని సరైన కంటెంట్ పడితే దర్శకుల ప్రతిభ ఎక్కడికీ పోదని `మా ఇంటి బంగారం` విజయంతో మరోసారి నిరూపితమైంది. ఈ సినిమా సాధించిన సక్సెస్ నందిని రెడ్డిలోని మేకింగ్ స్టైల్‌ను, ఎమోషన్స్‌ను పండించే నైపుణ్యాన్ని ప్రేక్షకులకు, పరిశ్రమకు మరోసారి గుర్తుచేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధించిన వసూళ్లు.. వచ్చిన పాజిటివ్ టాక్ ఆమెకు పాత రోజులను తెచ్చిపెట్టడమే కాకుండా టాలీవుడ్‌లో అమ్మడి మార్కెట్ వాల్యూను ఒక్కసారిగా పెంచేసిందంటున్నారు.
ఈ విజయంతో నందిని రెడ్డికి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చాలా కాలం పాటు ఖాళీగా ఉన్న ఆమెతో సినిమాలు చేయడానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు యంగ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకునే యువ కథానాయకులు నందిని రెడ్డి మేకింగ్ స్టైల్‌పై నమ్మకంతో అవకాశాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం నందిని రెడ్డి పలువురు యంగ్ హీరోలకు కథలు వినిపించే పనిలో బిజీగా ఉన్నారు. ఆమె సిద్ధం చేసిన కొన్ని వినూత్నమైన లైన్స్‌పై యువ నటులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారట. కేవలం హీరోలే కాకుండా.. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు సైతం ఆమెతో ప్రాజెక్టులు చేయడానికి అడ్వాన్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. దీంతో నందిని తదుపరి చిత్రాల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సక్సెస్ అనేది దర్శకుడికి ఇచ్చే బూస్టింగ్ ఎలాంటిదో నందిని రెడ్డి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాలను ఆమె ఎలా ఉపయోగించుకోబోతున్నారనేది ఆసక్తికరం. తనదైన ముద్రతో కూడిన కథలను ఎంచుకుంటూ కొత్త జోరును ఇలాగే కొనసాగిస్తే నందిని రెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన విజయాలను అందుకోవడం ఖాయంగా చెప్పొచ్చు.
