రాజుగారు లాక్ చేసిన డైరెక్టర్ పై వాళ్ల కన్ను!
మాలీవుడ్ చిత్రం `మార్కో` తో సౌత్ ఇండియాలో సంచలనంగా మారిన మరో డైరెక్టర్ హనీఫ్ ఆదేనీ.
By: Srikanth Kontham | 24 Feb 2026 8:00 PM ISTమాలీవుడ్ చిత్రం 'మార్కో' తో సౌత్ ఇండియాలో సంచలనంగా మారిన మరో డైరెక్టర్ హనీఫ్ ఆదేనీ. 'ది గ్రేట్ ఫాదర్' చిత్రంతో మలయాళంలోకి డైరెక్టర్ గా ఎంటర్ అయిన హనీఫ్ తొలి సినిమాతోనే అక్కడ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇందులో మెయిన్ లీడ్ పోషించింది మమ్ముట్టి. అటుపై రెండవ చిత్రాన్ని కూడా అదే స్టార్ తో తెరకెక్కించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా రెండు విజయాలతో హనీఫ్ అదేనీ మాలీవుడ్లో సంచలనంగా మారాడు. అటుపై నియో నోయర్ యాక్షన్ థ్రిల్లర్ మార్కోని తెరకెక్కించి సౌత్ లో సత్తా చాటాడు.
ఈ విజయం అతడికి దక్షిణాది పరిశ్రమలో మంచి పేరు తీసుకొచ్చింది. హింస...రక్తపాతంతో కరుడ గట్టిన డైరెక్టర్ గా వైరల్ అయ్యాడు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంత హింసతో కూడిన చిత్రం రావడం అదే తొలిసారి కావడంతో? దర్శకుడిగా వెలిగి పోయాడు. అతడి ప్రతిభను గుర్తించి తెలుగు నిర్మాత దిల్ రాజు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసాడు. `మార్కో` తర్వాత సినిమా చేస్తే తన బ్యానర్లోనే చేయాలని లాక్ చేసాడు. వీరి మధ్య ఒప్పందం జరిగి చాలాకాలం అవుతోంది. అయితే ఇంత వరకూ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో తాజాగా హనీఫ్ ఆదేనీపై కోలీవుడ్ కన్ను పడ్డట్లు కనిపిస్తోంది.
లైకా ప్రొడక్షన్స్ హనీప్ తో సినిమా దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా చెల్లించిందని వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. లైకా ప్రొడక్షన్స్ అంటే కోలీవుడ్ అగ్ర గామి నిర్మాణ సంస్థల్లో ఒకటి. స్టార్ హీరోల టార్గెట్ గా సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పటికే చాలా మంది హీరోల డేట్లు లైకాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హనీఫ్ అదేనీని బరిలోకి దించితే గనుక ఏదో ఒక స్టార్ తో భారీ సినిమా చేయడం ఖాయం. ఇప్పటికే కోలీవుడ్ కు 1000 కోట్ల క్లబ్ సినిమా ఒకటీ లేదు. రెండు.మూడు సినిమాలు 700 కోట్ల వసూళ్ల వరకూ వచ్చి ఆగిపోయాయి.
'జైలర్ 2' తోనైనా ఆఫీట్ సాధిస్తారని కోలీవుడ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో హనీఫ్ అదేని దించడం ఆసక్తికరంగా మారింది. `మార్కో` ని 30 కోట్లలోనే తెరకెక్కించి 100 కోట్ల క్లబల్లో కూర్చోబెట్టాడు హనీఫ్. మాలీవుడ్ చిన్న పరిశ్రమ కాబట్టి పరిమిత బడ్జెట్ లోనే అక్కడ సినిమాల నిర్మాణం జరుగుతుంది. హనీఫ్ లాంటి మేకర్ కి భారీ బడ్జెట్..ప్రీ హ్యాండ్ ఇవ్వగలిగితే సరైన యాక్షన్ స్క్రిప్ట్ తో అద్భుతమైన సినిమా తీయగల సమర్ధుడే. మరి అలాంటి ప్రయత్నంలో భాగంగా లైకా హనీఫ్ దించుతుందా? అన్న సందేహం లేకపోలేదు. మరేం జరుగుతుందన్నది చూడాలి.
