Begin typing your search above and press return to search.

విలువైన కానుకలు హీరోలకేనా.. మరి హీరోయిన్ల పరిస్థితి?

సినిమా విజయంలో అంతే కీలక పాత్ర పోషించిన హీరోయిన్లకు మాత్రం అలాంటి విలువైన బహుమతులు ఎందుకు దక్కడం లేదనే చర్చ మొదలైంది.

By:  Madhu Reddy   |   11 Sept 2026 7:59 PM IST
విలువైన కానుకలు హీరోలకేనా.. మరి హీరోయిన్ల పరిస్థితి?
X

సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి రూ. వందల కోట్లు కొల్లగొడితే నిర్మాతలు లేదా హీరోలు ఆనందంతో డైరెక్టర్లు, టెక్నీషియన్లకు ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారింది. లగ్జరీ కార్లు, వాచీలు, బంగారు నాణేలు కానుకలుగా ఇస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒక చిన్న అసంతృప్తి తెరపైకి వస్తోంది. సినిమా విజయంలో అంతే కీలక పాత్ర పోషించిన హీరోయిన్లకు మాత్రం అలాంటి విలువైన బహుమతులు ఎందుకు దక్కడం లేదనే చర్చ మొదలైంది.

బ్లాక్‌బస్టర్ హిట్స్ – బిఎమ్‌డబ్ల్యూ, రేంజ్ రోవర్ కార్ల కానుకలు:

గతంలో 'విక్రమ్' హిట్ అయినందుకు కమల్ హాసన్ దర్శకుడు లోకేష్‌కి లెక్సస్ కారు ఇచ్చారు. 'ఓజీ' విజయం తర్వాత పవన్ కళ్యాణ్ సుజిత్‌కు, అలాగే చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ కార్లు బహుమతిగా ఇచ్చారు. ఇక తాజాగా ' డీసీ ' సినిమా సూపర్ హిట్ కావడంతో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఏకంగా హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లకు లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కార్లను కానుకగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

నటనతో మెప్పించినా హీరోయిన్లకు హ్యాండ్?:

ఇలాంటి ఘన విజయాల్లో కథానాయికల పాత్ర కూడా ఎంతో ముఖ్యం. ఉదాహరణకు 'డీసీ ' సినిమాలో వామికా గబ్బి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. హీరో, డైరెక్టర్లకు ఇచ్చినట్లే ఈమెకు కూడా ప్రాధాన్యం ఇచ్చి కానుకలు ఇస్తే బాగుండేదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇక హీరోలతో సమానంగా, కొన్నిసార్లు వారి కంటే ఎక్కువగా మెప్పించే హీరోయిన్లను మాత్రం నిర్మాతలు ఈ గిఫ్టుల విషయంలో పక్కన పెట్టేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

పారితోషికంలోనే కాదు.. బహుమతుల్లోనూ వివక్షేనా?:

ఇండస్ట్రీలో ఇప్పటికే హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్ల మధ్య కొండంత వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు సినిమా సక్సెస్ సెలబ్రేషన్లలో ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్టుల్లో కూడా హీరోయిన్లను పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నటనతో సినిమాకు ప్రాణం పోసే నటీమణుల కష్టాన్ని కూడా నిర్మాతలు గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉంది.

మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది:

ఒక సినిమా విజయం అనేది ఒక్కరిది కాదు, యూనిట్ అందరిదీ దర్శకులు, హీరోలతో పాటు సినిమా సక్సెస్‌లో ప్రధాన భాగమైన హీరోయిన్లను, ఇతర కీలక నటులను కూడా ఇలాంటి బహుమతులతో ప్రోత్సహిస్తే ఇండస్ట్రీలో మరింత మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇక సినిమాను విజయం వైపు నడిపించడంలో హీరోయిన్ల పాత్ర కూడా తక్కువేమీ కాదు. కాబట్టి కేవలం పురుషాధిక్యత కాకుండా, ప్రతిభ చూపించిన కథానాయికలకు కూడా లగ్జరీ కానుకలు అందించి వారి నటనను గుర్తించినప్పుడే అసలైన విజయానికి సార్థకత చేకూరుతుంది అంటున్నారు.