Begin typing your search above and press return to search.

కల్ట్ మూవీకి సీక్వెల్ కన్ఫమ్

ఒక సినిమా రిలీజవుతున్నపుడు మేకర్స్ దాని గురించి చాలా గొప్పలు పోతుంటారు. ఛాలెంజులు కూడా విసురుతుంటారు.

By:  Garuda Media   |   1 Aug 2026 6:00 AM IST
కల్ట్ మూవీకి సీక్వెల్ కన్ఫమ్
X

ఒక సినిమా రిలీజవుతున్నపుడు మేకర్స్ దాని గురించి చాలా గొప్పలు పోతుంటారు. ఛాలెంజులు కూడా విసురుతుంటారు. కానీ ఈ మాటల్లో ఉన్న గొప్పదనం సినిమాల ఉండదు. ఛాలెంజులు ట్రోల్ మెటీరియల్స్ లాగా మారిపోతుంటాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ తన ప్రొడక్షన్లో వచ్చిన కొన్ని సినిమాల విషయంలో చెప్పిన మాటలు తేడా కొట్టాయి. కానీ ‘లక్కీ భాస్కర్’కు ఆయన ఇచ్చిన ఎలివేషన్ మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజమనిపించింది.

తన బేనర్లో వచ్చిన బెస్ట్ మూవీ ఇదని... ఈ సినిమాలో ఒక్క లోపం కూడా చూపించలేరని ఆయన ఛాలెంజ్ చేయగా, సినిమా చూసిన వాళ్లకు నిజంగానే ఇందులో ఏ లోపం కనిపించలేదు. బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన పోటీ ఉండడం వల్ల కమర్షియల్‌గా మరీ పెద్ద విజయం సాధించలేదు కానీ.. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కించుకుని కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది ‘లక్కీ భాస్కర్’. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ కన్ఫమ్ చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి.

‘లక్కీ భాస్కర్’ సినిమా చూస్తే.. దానికి సీక్వెల్ చేసే స్కోప్ ఉందని అర్థమవుతుంది. ఇండియాలో పెద్ద స్కామ్ చేశాక, చివర్లో జ్ఞానోదయం అయి.. మొత్తం అంతా సెటిల్ చేసేసి అమెరికాకు వెళ్లిపోతాడు భాస్కర్. మరి అమెరికాకు వెళ్లాక భాస్కర్ ఏం చేశాడు.. తిరిగి ఇండియాకు వచ్చాడా? ఇంకేదైనా కొత్త స్కామ్ మొదలుపెట్టాడా అనే నేపథ్యంలో ఈ కథను విస్తరించడానికి అవకాశముంది. వెంకీ కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లున్నాడు.

‘లక్కీ భాస్కర్’కు కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, రెండేళ్ల తర్వాత ఆ సినిమాను మొదలుపెడతానని అతను చెప్పాడు. ఈలోపు రెండు సినిమాలు చేయబోతున్నట్లు తెలిపాడు. అందులో ధనుష్ హీరోగా చేసే పోలీస్ మూవీ ఒకటి కాగా.. ఇంకోటి పిల్లల సినిమా అట. కాబట్టి వెంకీ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే 2030లో ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ వచ్చే అవకాశముంది. సూర్య హీరోగా వెంకీ రూపొందించిన కొత్త చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.