భూత్ బంగ్లా- స్త్రీ కంటే గగుర్పాటు కలిగించే సినిమా!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 6.5 కోట్ల బడ్జెట్‌తో రూపొంది విడుదలై కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 850 కోట్లు వసూలు చేసిన ఈ హారర్ సినిమా గురించే చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
By: Sivaji Kontham | 29 May 2026 12:51 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన `భూత్ బంగ్లా` బాక్సాఫీస్ వద్ద 250 కోట్లు వసూలు చేసినా ఆ సినిమా బడ్జెట్ 120 కోట్లు దాటిపోయింది. అంతకుముందు వచ్చిన స్త్రీ 2, భూల్ భులయ్యా 2 వంటి హారర్ చిత్రాలు 500 కోట్ల క్లబ్‌లలో అడుగుపెట్టి సంచలనం సృష్టించినా.. వాటి బడ్జెట్లు 60 కోట్ల లోపు కానే కాదు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా సృష్టించిన విపరీతమైన హైప్ దృష్ట్యా.. కేవలం 6.5 కోట్ల అతి స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక హాలీవుడ్ హారర్ సినిమా భారతదేశంలో ఏకంగా 100 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు ఊహిస్తుండటం విశేషం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 6.5 కోట్ల బడ్జెట్‌తో రూపొంది విడుదలై కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 850 కోట్లు వసూలు చేసిన ఈ హారర్ సినిమా గురించే చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వారం రోజులుగా అమెరికా సహా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న ఈ హారర్ చిత్రం టైటిల్ `అబ్సెషన్`.. నేటి నుండి భారతదేశంలోనూ గ్రాండ్‌గా విడుదలైంది. ప్రముఖ యూట్యూబర్ కర్రీ బార్కర్‌కు దర్శకుడిగా ఇది మొదటి మూవీ అయినా... బాక్సాఫీస్ వద్ద దక్కిన ఈ ఊహించని మెగా విజయాన్ని చూసి అతడు తనను తాను నమ్మలేకపోతున్నాడట. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని తీసిన ఈ విజువల్ వండర్ హాలీవుడ్‌ను సైతం షేక్ చేస్తోంది.
ఈ సినిమా కథాంశం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సమాజంలో ఇతరులతో కలవడానికి, మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడే ఒక అమాయక యువకుడు.. తనకు నచ్చిన అమ్మాయిని ఎలాగైనా ప్రేమలో పడేయాలనే ఉద్దేశంతో ఒక మాయా బొమ్మను ఉపయోగిస్తాడు. ఆ బొమ్మ ఎలా మారింది? ఆ తర్వాత పరిస్థితులు అతని చేతులు దాటి ఎంత ఘోరంగా, భయంకరంగా మారాయనే సరికొత్త సైకలాజికల్ పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. సాధారణ కథనే దర్శకుడు స్క్రీన్ ప్లే మాయాజాలంతో అత్యంత ఉత్కంఠభరితంగా వెండితెరపై ఆవిష్కరించాడు.
భారతీయ సమీక్షకులు సైతం ఈ చిత్రాన్ని గగుర్పాటుకు గురి చేసే అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా కొనియాడుతున్నారు. సినిమాలో ఎక్కువ భాగం ఒకే చోట అతుక్కున్నట్టు సాగుతుందని అక్కడ బందీ అయి గజగజ వణికేంతగా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కథానాయికగా నటించిన ఇండే నవరెట్ నటన సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఒక పిచ్చి ప్రేమతో, అబ్సెషన్‌తో ఊగిపోయే భాగస్వామిగా ఈ నటి పండించిన హావభావాలు, నటన అద్భుతంగా ఉన్నాయని రివ్యూవర్లు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
కేవలం హఠాత్తుగా భయపెట్టే శబ్దాల మీద ఆధారపడకుండా, పాత్రల నటన ఒక వింతైన భయానక వాతావరణం ద్వారానే ప్రేక్షకుడిని భయపెట్టగలిగింది ఈ సినిమా. భయంకరమైన సౌండ్ డిజైన్, ఎమోషనల్ ఇంటెన్సిటీ, సైకలాజికల్ టెన్షన్ల కలయికతో ఇందులో హారర్ ఎలిమెంట్స్ పండాయి. ఈ తరహా హారర్ కాన్సెప్ట్‌లు గతంలోనూ వచ్చాయని కొందరు విమర్శించినా.. సినిమా రాబట్టిన రికార్డు వసూళ్లు చూశాక జనం మరో ఆలోచన లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రం నేటి తరం జెన్ జీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. దాదాపు 38 సెకన్ల నిడివి గల సీన్లను భారతీయ సెన్సార్ బోర్డ్ సీబీఎఫ్ సి తొలగించాక ఇక్కడ విడుదలైంది. విపరీతమైన హింస- లైంగికతకు సంబంధించిన సీన్లను కట్ చేసారు.
