16 గంటల పని ఒత్తిడితోనే సెట్లో మరణాలు.. టాలీవుడ్‌లోను బిగ్ డిబేట్!
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` సినిమా సెట్స్‌పై దారుణమైన పని పరిస్థితులు, సుదీర్ఘ పని వేళలపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
By: Sivaji Kontham | 30 Jun 2026 9:25 AM ISTబాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` సినిమా సెట్స్‌పై దారుణమైన పని పరిస్థితులు, సుదీర్ఘ పని వేళలపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెట్ లో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన తర్వాత దీనిపై ఫెడరేషన్ సీరియస్ గా దృష్టి సారించింది. సినిమా, టీవీ, వెబ్ సిరీస్ సెట్స్‌పై టెక్నీషియన్లను, కార్మికులను బానిసల్లా వాడుకుంటున్నారని... నిబంధనల ప్రకారం రోజుకు 12 గంటల షిఫ్ట్ మాత్రమే ఉండాల్సి ఉండగా, 16 నుండి 20 గంటల పాటు సుదీర్ఘంగా పనులు చేయిస్తున్నారని బాలీవుడ్ కార్మిక సమాఖ్య (FWICE) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్‌లో ఈ సమస్యను అక్కడి ఫెడరేషన్ సీరియస్‌గా పరిగణిస్తున్న నేపథ్యంలో.. టాలీవుడ్ (తెలుగు చిత్రసీమ) కార్మికుల్లోనూ, ఫెడరేషన్ పెద్దల్లోనూ దీనిపై ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఇటువంటి సమస్యలు తెలుగు పరిశ్రమలోనూ అంతర్గతంగా ఉన్నాయని... వీటిని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని టాలీవుడ్ ఫెడరేషన్ వర్గాలు భావిస్తున్నాయి.
నిజానికి చిత్ర పరిశ్రమ కార్మిక చట్టాలు, ఫెడరేషన్ నిబంధనల ప్రకారం.. సినీ కార్మికులకు `ఒక కాల్షీట్` కాలపరిమితి స్పష్టంగా నిర్దేశించారు. సాధారణంగా ఒక పగలు లేదా రాత్రి కాల్షీట్ అంటే గరిష్టంగా 8 నుండి 12 గంటల పని సమయం మాత్రమే ఉండాలి. షూటింగ్ అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ అదనంగా పనిచేయాల్సి వస్తే.. దానికి ప్రొడక్షన్ హౌస్‌లు కార్మికులకు కచ్చితంగా `ఓవర్ టైమ్` (OT) అలవెన్సులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గంటల తరబడి అదనపు అలవెన్సులు ఇచ్చినా కూడా మనుషుల శారీరక శ్రమకు ఒక పరిమితి ఉంటుందని, నిరంతరాయంగా 16 నుండి 20 గంటల పాటు పనిచేయించడం వల్ల కార్మికులు తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నారని కార్మిక సమాఖ్య పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మితిమీరిన అలసట వల్లే సెట్స్‌పై ప్రమాదాలు జరుగుతున్నాయని.. అందుకే పని వేళలను కచ్ఛితంగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ వినిపిస్తోంది.
సినిమా సెట్స్‌పై పనిచేసే వేలాది మంది దినసరి కూలీలు, టెక్నీషియన్ల ప్రాణ రక్షణ, భద్రతకు సంబంధించి నిర్మాతలు విధిగా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ జరిగే ప్రతి సెట్‌లోనూ ప్రాథమిక వైద్య సదుపాయాలు, అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి తరలించేందుకు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచడం ప్రాథమిక బాధ్యత. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు, భారీ సెట్ల నిర్మాణం -విద్యుత్ లైటింగ్‌తో కూడిన పనులు జరిగేటప్పుడు క్వాలిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ల పర్యవేక్షణ తప్పనిసరి. ప్రమాదకరమైన స్టంట్లు లేదా ఎత్తులో పనులు చేసే కార్మికులకు హెల్మెట్లు, సేఫ్టీ బెల్టులు వంటి రక్షణ కవచాలను ప్రొడక్షన్ యాజమాన్యమే సరఫరా చేయాలి. సెట్స్‌పై అగ్నిప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా నిరంతరం వైరింగ్ వ్యవస్థను తనిఖీ చేయించడం అత్యంత ముఖ్యం.
కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రతి ప్రొడక్షన్ హౌస్ తమ సెట్‌లో పనిచేసే రిజిస్టర్డ్ కార్మికులందరికీ విధిగా గ్రూప్ ఇన్సూరెన్స్ (ప్రాణ భీమా) కల్పించాల్సి ఉంటుంది. ప్రమాదవశాత్తూ ఏదైనా అరిష్టం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ - తక్షణ ఆర్థిక సహాయం అందేలా నిర్మాతల మండలి పర్యవేక్షించాలి. సుదీర్ఘ పని వేళల వల్ల వచ్చే శారీరక ఒత్తిడిని తగ్గించడానికి కార్మికులకు తగిన విశ్రాంతి సమయాన్ని, పౌష్టికాహారాన్ని అందించడం కూడా నిర్మాతల బాధ్యత కిందికే వస్తుంది. బాలీవుడ్ తరహాలోనే ఇకపై తెలుగు రాష్ట్రాల్లోని షూటింగ్ సెట్స్‌లో కూడా ఆరోగ్య, భద్రతా ప్రమాణాలపై తనిఖీలను మరింత కఠినతరం చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ ఫెడరేషన్ పెద్దలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
చనిపోయిన కార్మికుడికి 50లక్షల డిమాండ్:
భన్సాలీ సెట్లో విషాద పరిణామంపై `ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్` (ఎఫ్.డబ్ల్యూ.ఐ.సి.ఇ) తీవ్రంగా స్పందించింది. మరణించిన చంద్రధారి సింగ్ యాదవ్ కుటుంబానికి చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే 40 లక్షల పరిహారం ప్రకటించినా అది సరిపోదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. బాధితుడి వయసు కేవలం 42 సంవత్సరాలేనని ఆ కుటుంబానికి ఆయనే ఏకైక ఆర్థికంగా ఆదుకునే ఆధారమని సంస్థ అధ్యక్షుడు బి.ఎన్. తివారీ పేర్కొన్నారు. ఆయనపై ఎన్నో కుటుంబ బాధ్యతలు ఉన్నందున... ఆ కుటుంబానికి మెరుగైన ఆర్థిక భరోసా కల్పించేందుకు పరిహారాన్ని 50 లక్షలకు పెంచాలని భన్సాలీ ప్రొడక్షన్ టీమ్‌ను ఫెడరేషన్ డిమాండ్ చేసింది.
