Begin typing your search above and press return to search.

మ‌న‌వ‌డు న‌ట‌న‌లో తాత‌ని త‌ల‌పిస్తాడా?

ర‌ణ‌బీర్ క‌పూర్, విక్కీ కౌశ‌ల్, అలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా `ల‌వ్ అండ్ వార్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   24 April 2026 2:00 PM IST
మ‌న‌వ‌డు న‌ట‌న‌లో తాత‌ని త‌ల‌పిస్తాడా?
X

ర‌ణ‌బీర్ క‌పూర్, విక్కీ కౌశ‌ల్, అలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా `ల‌వ్ అండ్ వార్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదొక ముక్కోణ‌పు ప్రేమ క‌థ‌గా హైలైట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన నాటి నుంచే అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. ముగ్గురు పాత్ర‌ల‌ను సంజ‌య్ ఎంత గొప్పగా ఆవిష్క‌రిస్తాడు? అత‌డి కెరీర్ లో మ‌రో క్లాసిక్ హిట్ గా న‌మోద‌వుతుదా? అన్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఈ చిత్రం 1964లో రాజ్‌కపూర్ న‌టించిన క్లాసిక్ చిత్రం `సంగం` స్పూర్తితో తెర‌కెక్కుతుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

ముఖ్యంగా రణబీర్ కపూర్ తన తాత రాజ్‌కపూర్ పోషించిన పవర్‌ఫుల్ పాత్రను గుర్తుకు తెచ్చేలా నటించ బోతున్నాడ‌నే ప్ర‌చారం అంత‌కంత‌కు హీటెక్కిస్తోంది. కపూర్ వారసుడు తాత స్థాయి నటనను మళ్ళీ వెండితెరపై ఆవిష్కరిస్తాడా ? అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. `ల‌వ్ అండ్ వార్` 1960ల నాటి పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. రణబీర్ కపూర్ విక్కీ కౌశల్ భారత వైమానిక దళం అధికారుల పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇవే పాత్ర‌ల‌ను సంగం చిత్రంతో భ‌న్సాలీ ఇలా ముడిపెడుతున్నాడ‌ని ఊహాగానాలొస్తున్నాయి.

`సంగం` చిత్రంలో రాజ్‌కపూర్ రాజేంద్ర కుమార్ మధ్య ఉన్న స్నేహం, త్యాగం , త్రికోణ ప్రేమకథను భన్సాలీ తనదైన శైలిలో నేటి కాలానికి అనుగుణంగా మలిచినట్లు సమాచారం. రణబీర్ పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ లేదా దూకుడు స్వభావం ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. ఇదే రాజ్‌కపూర్ నటనను తలపిస్తుందని భావి స్తున్నారు. తాత స్ఫూర్తితో ర‌ణ‌బీర్ క‌పూర్ ఆ పాత్రను పోషించడం సవాలు గౌరవం తో కూడుకున్న‌దే. రాజ్‌కపూర్ తన సినిమాల్లో చూపించే ఆ ఎమోషనల్ డెప్త్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను రణబీర్ ఎలా అందిస్తాడు? అన్న‌ది ఆస‌క్తిక‌ర అంశం. ఈ త్రికోణ ప్రేమకథలో అలియాభ‌ట్ పాత్ర ఎంతో కీల‌క‌మైంది. ఆ పాత్ర‌లో ఎమోషన్స్ పీక్ లెవల్‌లో ఉంటాయని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించడం, యుద్ధం వారి జీవితాలను ఎలా మార్చేసింది అనే అంశాలను భన్సాలీ అత్యంత భారీ స్థాయిలో చూపించ‌బోతున్నారుట‌. భన్సాలీ మేకింగ్‌లో ఉండే గ్రాండియర్ , 1960ల నాటి సెట్టింగ్‌లు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయ‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. ముంబైలో ఇటలీ వంటి విదేశీ లొకేషన్లను రీక్రియేట్ చేయడం సినిమా స్థాయిని చాటుతోంది. మొత్తంగా `లవ్ అండ్ వార్` సినిమా మాత్రమే కాదు. ఇది రెండు తరాల కపూర్ల నటనకు మధ్య వారధిగాను నిలుస్తుంది.